TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం ను ఎదుర్కొనేందుకు తెరపైకి కొత్త వాదన

Published on: Sun Jan 8, 2012 9:05AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీలో బలమైన వర్గం పనిచేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డిపై ఎవరికి వారు వ్యక్తిగతంగా ఏదో ఇతరేతర కారణాల వల్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని ఇంత కాలం అనిపించింది. కానీ, బలమైన కారణంతో, బలమైన వర్గమే ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య పొసగడం లేదనే వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేయడం వల్లనే ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని అంటున్నారు. కానీ, బొత్స సత్యనారాయణకు సంబంధం లేకుండా తెలంగాణకు చెందిన దళిత, బహుజన నాయకులు కిరణ కుమార్ రెడ్డిని వ్యతిరేకించడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది. మంత్రి పి. శంకరరావు వరుస విమర్శల వెనక ఓ లాబీ ఉందని అంటున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డిని ఎదుర్కోవడానికి తాజాగా ఆ నాయకులు కొత్త వాదనను ముందుకు తెచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పట్ల కిరణ్ కుమార్ రెడ్డి మెతక వైఖరి అవలంబిస్తున్నారనేది ఆ వాదన. ఈ విషయంపై కిరణ్ కుమార్ రెడ్డి మీద డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సమక్షంలోని కడిగి పారేయడం అందులో భాగమేనని అంటున్నారు. హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని చూపిస్తూ శంకరరావు వరుసగా ముఖ్యమంత్రిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జగన్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చారు. వీరికి ఎమ్మార్పీయస్ నేత మంద కృష్ణమాదిగ, బిసి సంఘం నాయకుడు ఆర్. కృష్ణయ్య వంటివారు కూడా తోడుగా నిలుస్తున్నారు. నిబంధన కాకపోయినప్పటికీ డిప్యూటీ ముఖ్యమంత్రికి హోం శాఖను అప్పగించడమనే సంప్రదాయం ఉంది. దామోదర రాజనర్సింహను ఉప ముఖ్యమంత్రిగా నియమించినా హోం శాఖ మాత్రం సబితా ఇంద్రా రెడ్డి వద్దనే ఉంది. ఆ శాఖ దామోదర రాజనర్సింహ చేతికి వచ్చేలా ముఖ్యమంత్రిపై, పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవడమే ఆ లాబీ ఉద్దేశంగా ప్రచారం జరుగుతోంది.