TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎంపై మరోసారి విరుచుకుపడ్డ శంకరరావు

Published on: Sat Jan 7, 2012 1:11PM

హైదరాబాద్: చేనేత శాఖమంత్రి శంకర్రావు మరోసారి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. మంత్రినైన తనకు రక్షణ కల్పించకుండా చంద్రబాబుకు 5వేలమంది పోలీసులతో భద్రత ఎలా ఇచ్చారన్నారు. తనపై దాడి జరిగి చాలారోజులు అయినా ఇంతవరకూ ముఖ్యమంత్రి పరామర్శించలేదన్నారు. పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని సీఎం గుర్తు పెట్టుకోవాలని, ఆయన తన పద్ధతి మార్చుకోవాలని శంకర్రావు హితవు పలికారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విమర్శిస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని జైలుకు పంపించారని, అదే న్యాయం జగన్‌కు ఎందుకు వర్తించదని, జగన్ బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేయరా అని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున జగన్‌ను అరెస్టు చేయాలని కోర్టులో పిటిషన్ వేస్తానని ఆయన చెప్పారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో సబితా ఇంద్రా రెడ్డి కుమారుడు కార్తిక రెడ్డి పాత్ర బయటపడుతుందనే ఉద్దేశంతోనే భాను కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేయడం లేదని ఆయన అన్నారు. పోస్టింగుల్లో సబితా ఇంద్రా రెడ్డి డబ్బులు వసూలు చేశారని ఆయన ఆరోపించారు.