మంత్రివర్గంలోకి చిరువర్గం రాకకు ముహూర్తం ఖరారు
Published on: Sat Jan 7, 2012 8:33AM
హైద
రాబాద్: మెగాస్టార్ చిరంజీవి వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులను ఇద్దరిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17వ తేదీన ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఎమ్మల్సీ రామచంద్రయ్యను, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలోకి తీసుకుంటారు. ఈ ముహూర్తాన్ని కూడా చిరంజీవే ఖరారు చేశారని తెలుస్తోంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సమక్షంలో ఈ ముహూర్తం ఖరారైంది. ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వాలని చిరంజీవి పట్టుబట్టినా ఆజాద్ సర్ది చెప్పారు. రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదనను కడప కాంగ్రెసు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. కాగా, చిరంజీవి వర్గానికి చెందిన శాసనసభ్యులకు విప్, కార్పొరేషన్ పదవులు దక్కనున్నాయి. మంత్రి పదవుల కోసం ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో ఆలస్యం జరగడంపై తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. మంత్రి పదవులు దక్కించుకునే ఇద్దరికి కూడా ముఖ్యమైన శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.


