ఆజాద్ రాక..వాడి,వేడిగా సమన్వయ కమిటీ తొలి సమావేశం
Published on: Thu Jan 5, 2012 8:35AM
హైదరా
బాద్: రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మధ్య సమన్వయం చేసేందుకు కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ నాయకత్వంలో అధిష్ఠానం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో జరగనుంది. సమన్వయ కమిటీ తొలి సమావేశమే వాడిగా, వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమన్వయ కమిటీ సభ్యులైన కొందరు ముఖ్య నాయకులు పోటాపోటీ నివేదికలను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. ముఖ్యమత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఇద్దరు నాయకులు పదేపదే చెబుతున్నప్పటికీ వివిధ సందర్భాల్లో వారి మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఈ ఇద్దరు నాయకులు పోటాపోటీ నివేదికలను తయారు చేస్తుండటాన్ని బట్టి ఆజాద్ సమక్షంలోనే వీరి మధ్య ఉన్న విభేదాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదిర్చే అంశం ఎలాఉన్నా ముందు ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షునికి మధ్య సమన్వయం కుదర్చాల్సిన బాధ్యత ఆజాద్ మీద ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై చర్చించి నిర్ణయం తీసుకునే వీలుంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని గట్టెక్కించిన పీఆర్పీకి ఇవ్వాల్సిన పదవులపైనా ముఖ్యమంత్రి, బొత్సలతో చర్చించే అవకాశం ఉందంటున్నారు.
కాగా, లేక్ వ్యూ అతిథి గృహంలో బస చేసిన ఆజాద్‌ను పలువురు నాయకులు కలుసుకోనున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలు ఉండటంతో పదవులను ఆశించేవారు విజ్ఞప్తులు చేయనున్నారు. ఉప ఎన్నికల తర్వాతనే మంత్రివర్గ మార్పులు జరగనున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భిన్నాభిప్రాయాలను అజాద్ వద్ద వ్యక్తం చేయనున్నారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన వారిని ఎలాగూ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నందున కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని కూడా మంత్రివర్గంలోకి ఇప్పుడే తీసుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు ఆజాద్‌కు విజ్ఞప్తి చేయనున్నారు. ఆదే సందర్భంలో మరి కొంతమంది ఎమ్మెల్యేలు అసలు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణే వద్దని, ఉప ఎన్నికల తర్వాత ఒకే సారి మంత్రివర్గ మార్పులు చేసి ప్రజారాజ్యం పార్టీకి చెందిన వారిని కూడా అప్పుడే తీసుకోవాలని ఆజాద్‌కు చెప్పనున్నారు. ఇది ఇలా ఉండగా మంత్రి శంకరరావు వైఖరిపై ఆజాద్‌కు ఫిర్యాదు చేసేందుకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మద్దతుదారులతో పాటు మరికొందరు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు.


