TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు

Published on: Sun Dec 25, 2011 8:09AM

హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రార్థనలు, గీతాలాపనతో లోకరక్షకుడిని భక్తులు స్తుతిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన చర్చిలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్రీస్తు జననాన్ని ఆహ్వానిస్తూ  చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రార్థనలు జరిపారు. మెదక్‌లోని సీఎస్‌ఐ చర్చిని విద్యుత్ దీపాలతో శోభయమానంగా అలంకరించారు. చర్చి ప్రాంగణంలో క్రీస్తు జనన రూపకం ప్రదర్శించారు. భక్తుల కోసం భారీగా విడిది ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు క్రిస్మస్ సంబరాలు జరగనున్నాయి. 500 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లాలోని గుణదలమేరీ మాత చర్చిలో వేలాది మంది భక్తులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.


క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, త్యాగం సేవ, శాంతి లాంటి ఎన్నో శుభగుణాలను గుర్తుచేసే జీసెస్‌ క్రీస్తు సందేశాన్ని ఈ క్రిస్మస్‌ మనకు అందిస్తుందని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్  పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ చక్రపాణిలు కూడా వేర్వేరు ప్రకటనల్లో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.


కాగా, వచ్చే క్రిస్మస్‌ వేడుకలు తెలంగాణలోనే జరుపుకుందామని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరావు తెలంగాణవాదులకు భరోసానిచ్చారు. తెలంగాణ భవన్‌లో వేడుకగా జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుప్రభు దయవల్ల తెలంగాణ రాష్ట్రం తప్పక వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న వివక్షతపై కేంద్రానికి లేఖ రాస్తానని ఆయన అన్నారు.