ఎన్నికల సమరంలో హుజూర్ నగర్..

 

తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే ఏకైక ఉప ఎన్నిక కావడంతో హుజూర్ నగర్ శాసన సభ నియోజకవర్గంపైనే రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఒక్క సీటు కోసం అధికార టీఆర్ ఎస్ పార్టీ వందల సంఖ్యలో గులాబి సైన్యాన్ని నియోజకవర్గంలో మోహరించింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ నియోజక వర్గంలో ఆ పార్టీ మళ్లీ ఎలాగైనా విజయకేతనం ఎగురవేయాలని బైపోల్ పోరుకు సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టిన టిడిపి తెలంగాణలో తన పూర్వ వైభవాన్ని సాధించేందుకు ఒంటరిగా పోరులో నిలబడింది. ఈ ఉప ఎన్నిక ఫలితాలతోనే త్వరలో జరగబోయే మున్సిపోల్స్ కి ఆ పార్టీ సన్నద్ధం కానుంది. ఇక ఈ సారి జరిగిన ఎంపీ ఎన్నికల్లో సారు, కారు, పదహారు అంటూ టీఆర్ ఎస్ ప్రదర్శించిన జోరుకి బ్రేక్ వేసినా బిజెపి హుజూరునగర్ బైపోల్స్ ద్వారా తన సత్తా చాటేందుకు తహతహలాడుతోంది. సిపిఎం సైతం తన ఉనికిని చాటుకునేందుకు ఒంటరిగా బరిలోకి దిగింది. అధికార టీఆర్ ఎస్ పార్టీకి సిపిఐ అధికారికంగా మద్దతు ప్రకటించింది. అలాగే ప్రతి పక్ష కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి పార్టీ మద్దతు ప్రకటించింది. నామినేషన్ ల పర్వం కూడా ముగియడంతో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటా పోటీగా ప్రచారాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. 

హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడించేందుకు అధికార టీఆర్ ఎస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రుల నుంచి పార్టీ ముఖ్య నేతల వరకు వందల సంఖ్యలో గులాబీ సైన్యాన్ని దించుతోందని సమాచారం. ఇటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం టీఆర్ ఎస్ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకులు అందరినీ ఏకతాటి పైకి తీసుకు రావడంపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా గత నెల ముప్పై న నిర్వహించిన హుజూర్ నగర్ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఐక్యతా రాగాన్ని వినిపించారు. ఈ సభలో జానారెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీ్ధర్ బాబు, దామోదర్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్ వంటి నాయకుల చేసిన ప్రసంగాలు హస్తం శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపాయి. పద్మావతి గెలుపు కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మక అవసరం అని హుజూర్ నగర్ ఉప ఎన్నిక నాలుగుకోట్ల ప్రజలకు ఒక నియంతకు మధ్య జరుగుతున్నదని ఆ పార్టీ ముఖ్య నేతలు ఇచ్చిన సందేశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక ఆడబిడ్డను ఓడించేందుకు ఇంత మంది టీఆర్ ఎస్ మంత్రులు రంగంలోకి దిగడం, ప్రజలు గమనించాలన్న వారి వ్యాఖ్యలు కూడా హుజూర్ నగర్ నియోజక వర్గంలో పురుష ఓటర్ల కంటే అధికంగా ఉన్న మహిళా ఓటర్లను ఆలోచనల్లో పడేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ముప్పై వేల ఓట్ల మెజారిటీ రాకుంటే తాను ఏ శిక్షకైనా సిద్ధమని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయం విదితమే, అయితే ఆయన మాటలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుని డిసైడ్ చేసినట్టుగా ఉన్నాయని రాజకీయ వర్గాల వారు అంటున్నారు. నియోజక వర్గ ఓటర్ల పై ఉన్న అపార అనుభవం నాన్ లోకల్ ఓట్ల క్లారిటీ ఉత్తమ్ కు కలిసి రానున్నాయి చెబుతున్నారు. అయితే టీఆర్ ఎస్ అభ్యర్థి సైది రెడ్డికి యాభై వేల ఓట్ల మెజారిటీ వస్తుందని ఆ పార్టీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇతర నియోజక వర్గాల్లో గత ఎన్నికల్లో టిఆర్ ఎస్ సాధించిన విజయాలే అందుకు నిదర్శనమని వారు చెబుతున్నారు. అయితే క్యాడర్ బలంగా ఉన్న టిడిపి, బిజెపి, సిపిఎం పార్టీలు అధికార టీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. హుజూర్ నగర్ లో గత ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే కారు పార్టీకీ మెజారిటీ తగ్గే అవకాశం లేకపోలేదని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే మొన్నటిదాకా ఒకరంటే ఒకరికి పడని కాంగ్రెస్ ముఖ్య నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు ఏకతాటి పైకి రావడం ఉత్తమ్ పద్మావతి గెలుపునకు హస్తం పార్టీకి కలిసొచ్చే శుభపరిణామంగా భావిస్తున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ గులాబీ జెండా ఖచ్చితంగా ఎగరాలని ఆ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఒక్క సీటు గెలిపించుకునేందుకు వంద కోట్లు ఖర్చు పెట్టడానికైనా టీఆర్ ఎస్ వెనుకాడడం లేదని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. శాసన సభలో ఇప్పటికే సంపూర్ణ మెజారిటీ కలిగిన టీఆర్ఎస్ కి ఈ ఒక్క స్థానంలో గెలిచే ఎమ్మెల్యేతో వచ్చే లాభం గాని, జరిగే నష్టం గానీ ఏమీ లేదు. కేవల ఉత్తమ్ కంచుకోటలో పాగా వేస్తామని తృప్తి పడడానికి కాంగ్రెస్ పార్టీ ఉనికి తగ్గిందని చాటి చెప్పడానికి గులాబీ నేతలు తహతహలాడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అధికార పార్టీ సామదానభేద దండోపాయాలను కూడగట్టుకొని యుద్ధాన్ని తలపించేలా ఓటర్లను ఆకర్షిస్తోందని అంటున్నారు. ఇప్పటికే కులాలు, మతాల ప్రాతిపదికన ఓటర్లను విభజించి ఆయా సామాజిక వర్గాల వారీగా నియమించిన కమిటీల నాయకుల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో నామినేషన్లు భారీగా తిరస్కరణకు గురి కావడం చర్చ నీయాంశంగా మారింది. మొత్తం 76 మంది అభ్యర్థులు 119 సెట్ ల నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 30 మంది దాకా సర్పంచ్లుండటం గమనార్హం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు నామినేషన్లు వేశారు. కాగా ఈ నెల ఒకటి న జరిగిన స్క్రూటినీలో సిపిఎం అభ్యర్థి పారుపల్లి శేఖరరావుతో సహా నలభై నాలుగు మంది అభ్యర్ధులు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 31 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు ఓకే అయ్యాయి. మొత్తమ్మీద హుజూర్ నగర్ ఉప ఎన్నికలు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. ఒకవేళ కారు పార్టీ గెలిస్తే మహిళా అభ్యర్థిని పై ఇంత అధికారం మందీ మార్భలాన్ని మోహరించారని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టే అవకాశాలున్నాయి. అలాకాక హస్తం పార్టీకి విజయం దక్కితే అధికార టీఆర్ ఎస్ పై ప్రజా వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ నేతలు జోరు పెంచే యోచనలో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మహిళా సెంటిమెంట్ గుంపులు గుంపులుగా వచ్చే టీఆర్ ఎస్ సైన్యాన్ని ఎలా ఎదుర్కొంటుందో తెలియాలంటే అక్టోబర్ ఇరవై నాలుగు వరకు వేచి చూడాల్సిందే.