బిజెపికి అగ్ని పరీక్షగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలు...!

 

హుజూర్ నగర్ ఉప ఎన్నికల అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడింది బిజేపీ. ఇందు కోసం బీజేపీ కోర్ కమిటీ హైదరాబాద్ లో సమావేశమైంది. ఈ భేటీలో హుజూర్ నగర్ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. తెలంగాణలో బలోపేతమయ్యేందుకు హుజూర్ నగర్ ఎన్నికలను అవకాశంగా భావిస్తున్నారు కమలనాథులు. ఇప్పటికే నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిన ఊపులో ఉన్న బీజేపీ నాయకులు, తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటు కేంద్ర మంత్రులు వరుసగా తెలంగాణాలో పర్యటిస్తున్నారు.

ఈ సమయంలో వచ్చిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. బిజెపి తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని చెబుతూ వస్తుంది, నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత ఇక తెలంగాణలో మేమే ముందుంటాం అని, ఏ ఎన్నికలు జరిగినా కూడా తమ సత్తా చాటుతామని చెప్పినటువంటి బిజెపికి హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఒక అగ్ని పరీక్షగా మారిందని చెప్పొచ్చు.  ఈ హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నిక ద్వారా బిజెపి భవిష్యత్తు ఏంటనేది తేలనుంది.

ఈ నేపథ్యంలో బిజెపి నేతలు హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. హుజూర్ నగర్ లో ఏ అబ్యర్ధి అయితే బాగుంటుందనే చర్చ జరుపుతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో గాని, పార్లమెంట్ ఎన్నికల్లో గాని బిజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగలటంతో ఈ సారి ఉప ఎన్నికకు గట్టి అంగ బలం ఉన్న అబ్యర్ధిని బరిలోకి దించాలని, కొత్తగా బిజేపీలో చేరిన వ్యక్తులకు హుజూర్ నగర్లోని వివిధ మండలాలకు సంబందించి ఇంచార్జి పదవులు అప్పగించటానికి ఈ రోజు జరిగే కోర్ కమిటీ సమావేశంలో బిజెపి చర్చించనుంది.