TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్లీనరీలో హుజురాబాద్ పైనే చర్చ.. గులాబీ లీడర్లలో కనిపించని ధీమా!

Published on: Mon Oct 25, 2021 3:35PM

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఘనంగా జరిగింది. పార్టీ 20 వార్షికోత్సవ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి గులాబీ నేతలు హాజరయ్యారు. ద్వదశాబ్ది  కావడంతో అధికార పార్టీ గతంలో కంటే ఘనంగా ఏర్పాట్లు చేసింది. అయితే ప్లీనరిలో హుజురాబాద్ ఉప ఎన్నికే ప్రధాన చర్చగా మారింది. ప్లీనరీకి వచ్చిన టీఆర్ఎస్ నేతలంతా హుజురాబాద్ లో పరిస్థితి ఏంటీ, ఎవరు గెలుస్తారు.. పోలింగ్ నాటికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న దానిపై చర్చించుకోవడం కనిపించింది.

ప్లీనరీలో ఏ ఇద్దరు లీడర్లు కలిసినా వాళ్ల చర్చ హుజురాబాద్ ఉప ఎన్నికపైకే వెళ్లింది. కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు హజురాబాద్ సరిహద్దులో ఉన్న వరంగల్ జిల్లా నేతలతో అక్కడి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు గులాబీ లీడర్లు. ప్లీనరీకి కరీంనగర్, వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు రాలేదు. హుజురాబాద్ లో ప్రచారం చేస్తున్న నేతలందరిని అక్కడే ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారట. దీంతో హుజురాబాద్ ఇంచార్జీగా ఉన్న మంత్రి హరీష్ రావుతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ప్లీనరీకి రాలేదు. మండలాలకు ఇంచార్జులుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా రాలేదు. అయినా హుజురాబాద్ తో సంబంధాలున్న నేతలు ఎవరూ కలిసినా ఉప ఎన్నికలో పార్టీ పరిస్థితి ఏంటని ఇతర ప్రాంత టీఆర్ఎస్ లీడర్లు అడగడం కనిపించింది. 

హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీ గెలిచే పరిస్థితి లేదన్నట్లుగానే మెజార్టీ టీఆర్ఎస్ లీడర్లు మాట్లాడుకోవం కనిపింపించింది. ఎంతగా కష్టపడినా గెలవడం కష్టమని,ఈటల రాజేందర్ పై ప్రజల్లో సానుభూతి కనిపిస్తోందని కరీంనగర్,  వరంగల్ జిల్లాలకు చెందిన లీడర్లు అభిప్రాయపడ్డారు. ఈటలను తమ ఇంటివాడిగా హుజురాబాద్ ఓటర్లు భావిస్తున్నారని కొందరు చెప్పడం కనిపించింది. మందు, ధన ప్రభావం కొంత ఉన్నా.. ఈటలను ఓడించేంతగా అది ఉండకపోవచ్చని మరికొందరు చెప్పారు. దళిత బంధు పథకం వల్లే పార్టీకి ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని కొందరు టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెప్పారు. దళిత బంధుతో ఇతర వర్గాల ఓటర్లు కేసీఆర్ పై గుర్రుగా ఉన్నారని చెప్పారు.

మొత్తానికి టీఆర్ఎస్ ప్లీనరీలో హుజురాబాద్ ఉప ఎన్నికే కేంద్రం కావడం, టీఆర్ఎస్ లీడర్లే పార్టీ గెలుపుపై నమ్మకంగా లేకపోవడం ఆసక్తిగా మారింది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుజురాబాద్ లో ప్రచారం చేయకపోవడానికి ఓటమి ఖాయమని సర్వేల్లో తేలడమేననే అభిప్రాయం కూడా కొందరు నేతలు వ్యక్తం చేశారు.