TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హుజురాబాద్ పై వేల కోట్ల బెట్టింగ్స్! పోలీసులకు చిక్కకుండా ఆన్ లైన్ పేమెంట్స్..

Published on: Wed Oct 27, 2021 3:09PM

తెలంగాణలోని హుజురాబాద్ ఉపఎన్నిక ఇప్పుడు దేశంలో హాట్ హాట్ గా మారింది. బెట్టింగ్ రాయుళ్లంతా ప్రస్తుతం హుజురాబాదే కేంద్రంగానే దందా నడిపిస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలోనూ హుజురాబాద్ పై పెద్ద ఎత్తున బెట్టింగ్స్ సాగుతున్నాయంటే షాక్ గురికాక తప్పదు. 

హుజురాబాద్ లో పార్టీల బలబలాలు మారుతున్నట్లే బెట్టింగ్స్ కూడా మారిపోతున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకు ఒకవైపే ఉన్న బెట్టింగ్.. ఇప్పుడు రెండు ప్రధాన పార్టీల మధ్యకు చేరింది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల గెలుపుపై మొన్నటిదాకా రూ. 100, రూ. 200 కోట్ల వరకూ సాగిన పందెం దందా ఇప్పుడు రూ. 1,000 కోట్లకు ఎగబాకిందని తెలుస్త్తోంది. అయితే టీఆర్ఎస్ ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందరే గెలుస్తాడనే  ఎక్కువ మంది పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. రూపాయికి.. వెయ్యి రూపాయలు అనే స్థాయిలో బెట్టింగ్స్ నడుస్తున్నాయని..  వెయ్యి నుంచి మొదలైన బెట్టింగ్.. కోట్లకు చేరుతోందిని సమాచారం. 

పార్టీల గెలుపోటములతో పాటు అభ్యర్థుల మెజార్టీ, పార్టీల వారీగా వచ్చే ఓట్లపై సైతం బెట్టింగ్​కాస్తున్నారు. మండలాల వారీగా ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుందన్న దానిపై బెట్టింగ్స్ కాస్తున్నారని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు, పోలింగ్ బూతుల వారీగా కూడా పందేళ్లు నడుస్తున్నాయి. ఓవరాల్ గా ఈటల రాజేందర్‌కు 20 వేల మెజార్టీపై రూ.100కు పదింతలు అనే స్థాయిలో ఉంటే.. గెల్లు శ్రీనివాస్​ గెలుస్తాడని, కనీసం వెయ్యి నుంచి ఐదు వేల ఓట్ల మెజార్టీ వస్తుందని రూ. 1000కి నాలుగింతలు అని బెట్టింగ్ పెడుతున్నారని టాక్. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు చీల్చుతారనే కోణంలో కూడా పందెం వేసుకుంటున్నారు.

తెలంగాణతో పోల్చితే ఏపీలో బెట్టింగ్స్ ఎక్కువగా నడుస్తుంటాయి. దీంతో ఏపీకి చెందిన పందెంరాయుళ్లంతా ఇప్పుడు హుజురాబాద్ పై పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్నారని తెలుస్తోంది. ఏపీలో బద్వేల్‌లో ఉప ఎన్నిక ఉన్నా... అక్కడ పోటీ లేకపోవడంతో హుజురాబాద్ కేంద్రంగానే దందా నడుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు కూడా  బెట్టింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారని సమాచారం. ఆంధ్రా నాయకులు ఇక్కడ తెలిసిన వారికి ఫోన్‌ చేసి ఏ పార్టీ గెలుస్తుంది.. ఎంత మెజార్టీ వస్తుంది? అనే వివరాలను ప్రతీరోజూ తీసుకుంటున్నారట. ఇటీవల ఆంధ్రాకు చెందిన కొంతమంది నేతలు, వ్యాపారవేత్తలు, పందెంరాయుళ్లు ప్రత్యేకంగా వాహనాల్లో హుజూరాబాద్‌కు వచ్చి ప్రచార శైలిని అంచనా వేసి, పలు సర్వే నివేదికలను తీసుకొని వెళ్లారని స్థానికులు చెబుతున్నారు.

హుజూరాబాద్‌ ఎన్నికల బెట్టింగ్‌ నిర్వహించే బూకీలు ఆన్‌లైన్‌లోనే దందా నడుపుతున్నారని తెలుస్తోంది. కొంతమంది బూకీలు అటు కరీంనగర్, ఇటు వరంగల్‌లోని పలు హోటళ్లలో మకాం వేశారు. బెట్టింగ్​ పేమెంట్స్​కూడా మొత్తం ఆన్‌లైన్ ద్వారానే లావాదేవీలు చేస్తున్నట్టు చెబుతున్నారు. హుజూరాబాద్​ ఉప ఎన్నికపై ఐఏఎస్‌లు, ఉన్నతస్థాయి అధికారవర్గాల్లోనూ ప్రధానంగా చర్చ నడుస్తోంది. బీఆర్కే భవన్‌లోనే ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ, మరో ఇద్దరు ఉన్నతాధికారులు బెట్టింగ్‌కు దిగినట్టు చర్చ నడుస్తున్నది. ఈటల మంత్రిగా పనిచేసిన ఓ శాఖలోని మరో ఇద్దరు సీనియర్​ అధికారులు కూడా పందెం వేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఐపీఎస్ అధికారుల్లోనూ ఇదే చర్చ సాగుతున్నదని, ఇంటెలిజెన్స్ వర్గాలకు ఫోన్​ చేసి పరిస్థితులపై ఆరా తీస్తున్నారని తెలిసింది.