ఆగ‌ష్టులోనే హుజురా-వార్‌... స‌మ‌యం లేదు ఈట‌ల‌!

ఎమ్మెల్యే ప‌ద‌వికి మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా. హుజురాబాద్‌కు త్వ‌ర‌లో ఉప ఎన్నిక‌. ఆరు నెల‌ల లోపు ఎల‌క్ష‌న్ ఎప్పుడైనా రావొచ్చు. క‌రోనా కాబ‌ట్టి అంత‌కంటే ఎక్కువ స‌మ‌య‌మూ ప‌ట్టొచ్చు. ఇన్నాళ్లూ ఇదే న్యూస్ చూశాం. తాజాగా, ఢిల్లీ వ‌ర్గాల నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర అప్‌డేట్ వ‌స్తోంది. ఆగ‌ష్టులోపే హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌ర‌గొచ్చ‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌భావం హుజురాబాద్ మీద ప‌డ‌బోతోంది. అంటే, బెంగాల్‌లో స్విచ్ వ‌స్తే.. హుజురాబాద్‌లో లైట్ వెల‌గ‌బోతోంద‌న్న‌ట్టు.

అవును, బెంగాల్ ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్ ఈట‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ప్ర‌భావం చూప‌బోతోంది. మార్చిలో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ చేసింది కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌. బెంగాల్ దంగ‌ల్‌లో పోటీ ప‌డ‌టానికి ప‌లువురు ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి అసెంబ్లీ బ‌రిలో దిగారు. దీంతో, ఆయా చోట్ల‌ లోక్‌స‌భ స్థానాల‌కు ఖాళీలు ఏర్ప‌డ్డాయి. రాజీనామాల‌తో ఖాళీ అయిన పార్ల‌మెంట్ స్థానాల‌కు ఆరు నెల‌లలోగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఆ లెక్క‌న‌, బెంగాల్‌లో మార్చిలో చేసిన‌ రాజీనామాల‌కు.. ఆరు నెల‌ల వ్య‌వ‌ధి ఉంటుంది. అంటే, ఆగ‌ష్టుక‌ల్లా అక్క‌డ ఉప ఎన్నిక నిర్వ‌హించాల్సిన త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రోవైపు, క‌రోనా కార‌ణంగా ప‌లు రాష్ట్రాల్లో ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు మృతి చెందారు. ఆయా స్థానాల్లోనూ బైపోల్‌కు గ‌డువు ముంచుకురాబోతోంది. ఇలా, దేశ‌వ్యాప్తంగా ప‌లుచోట్ల ఈసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సిద్ధ‌మైతే.. ప‌నిలో ప‌నిగా హుజురాబాద్‌లోనూ ఎన్నిక‌ల న‌గారా మోగేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఈసీ వ‌ర్గాల నుంచి అందుతున్న‌ స‌మాచారం. 

జూన్ 12న‌ ఈట‌ల ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆగ‌ష్టులో హుజురాబాద్‌కు ఉప ఎన్నిక రాబోతుంద‌నే న్యూస్‌తో రాజకీయ వ‌ర్గాల‌న్నీ ఒక్క‌సారిగా అల‌ర్ట్ అయ్యాయి. ప‌ట్టుమ‌ని రెండు నెల‌ల్లోగా ఎల‌క్ష‌న్ జ‌రిగితే ఎవ‌రికి లాభం? మ‌రెవ‌రికి న‌ష్టం? అనే ఊహాగానాలు అప్పుడే మొద‌లైపోయాయి. ఆ గ‌డియార‌పు లెక్క‌ల చిక్కు ముల్లు భ‌లే ఆస‌క్తిగా ఉన్నాయి. 

కేబినెట్ నుంచి అర్థాంత‌రంగా ఈట‌ల‌ను మెడ‌బ‌ట్టి గెంటేయ‌డంతో రాజేంద‌ర్‌పై సానుభూతి వెల్లువెత్తింది. తాజాగా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణపై ఆస‌క్తి నెల‌కొంది. ఇలా విష‌యం వాడి-వేడిగా ఉన్న‌ప్పుడే ఎల‌క్ష‌న్ జ‌రిగితే.. అది ఈట‌ల‌కు అనుకూల ప‌రిణామం అయ్యే అవ‌కాశం ఉందంటున్నారు. ప్ర‌జ‌ల్లో ఈట‌ల ఎపిసోడ్ హాట్ హాట్‌గా ఉన్న‌ప్పుడే.. హుజురాబాద్‌లో ఎత్తుకు పైఎత్తు రాజ‌కీయం న‌డుస్తున్న‌ప్పుడే ఉప సంగ్రామం జ‌రిగితే.. ఆ ఎమోష‌న‌ల్ ఎన్విరాన్మెంట్ బాధితుడి ప‌క్షానే మొగ్గు చూపే ఛాన్సెస్ ఉంటాయ‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. ఈట‌ల వ‌ర్గంపై స‌ర్కారు నుంచి బెదిరింపులు, తాయిలాలు పూర్తి స్థాయిలో రాక‌ముందే.. రెండు నెల‌ల్లోనే ఎల‌క్ష‌న్ కోడ్ వ‌చ్చేస్తే.. రాజేంద‌ర్‌కు అది సేఫ్ యాంగిల్‌గా మారుతుంద‌నేది ఓ విశ్లేష‌ణ‌. అదే ఉప ఎన్నిక ఆల‌స్యం అయినా కొద్దీ.. స‌ర్కారు నుంచి కేడ‌ర్‌పై ప్రెజ‌ర్‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, ప్ర‌భుత్వ ప‌థకాల అమ‌లుతో.. ఓట‌ర్ల‌కు గాలం వేసి.. అధికార‌పార్టీ వైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నాలు పెద్ద ఎత్తున జ‌రగ‌డం మామూలు విష‌య‌మే. అది టీఆర్ఎస్‌కే అనుకూలం. 

అందుకే, ఇటు ఈట‌ల కానీ, అటు బీజేపీ కానీ.. హుజురాబాద్ ఉప ఎన్నిక ఎంత త్వ‌ర‌గా వ‌స్తే అంత బెట‌ర్ అని భావిస్తోంది. ఎలాగూ ఈట‌ల బీజేపీ కండువా క‌ప్పుకున్న‌ట్టే కాబ‌ట్టి.. ఈట‌ల‌కు అనుకూలంగానే బై ఎల‌క్ష‌న్ డేట్ వ‌చ్చే అవ‌కాశ‌మే ఎక్కువ అంటున్నారు. ఆ మేర‌కు రాజేంద‌ర్ ఇప్ప‌టికే ఢిల్లీ వ‌ర్గాల‌తో ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌ని కూడా చెబుతున్నారు. అందుకే, ఆయ‌న స‌మ‌యం లేదు మిత్ర‌మా అన్నట్టు.. రాజీనామా చేయ‌క‌ముందు నుంచే హుజురాబాద్‌లో తెగ ప‌ర్య‌టిస్తున్నారు. వ‌రుస స‌మావేశాలు, రోడ్‌షోల‌తో బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగుతున్నారని అంటున్నారు. 

జూన్‌లో రాజీనామా చేశార‌ని.. ఆరునెల‌ల్లోపు ఎన్నిక జ‌ర‌గాలి కాబ‌ట్టి.. అక్టోబ‌ర్ వ‌ర‌కూ వేచి చూసే ఓపిక ఇరు వ‌ర్గాల్లోనూ క‌నిపించ‌డం లేదు. అటు కేసీఆర్ సైతం హుజురాబాద్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టారు. మండ‌లాల వారీగా బాధ్య‌త‌ల‌ను బ‌డా నేత‌ల‌కు అప్ప‌గించారు. ఈట‌లకు పోటీగా బ‌ల‌మైన అభ్య‌ర్థిని ఎంపిక చేసే ప‌ని ఇప్ప‌టికే ప్రారంభించేశారు. ఎల‌క్ష‌న్ శంఖం ఎప్పుడు ఊదినా.. సంగ్రామానికి సిద్ధంగా ఉన్నాయి ఇరు ప‌క్షాలు. 

మ‌ధ్య‌లో కాంగ్రెస్ మేట‌ర్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈట‌ల‌కు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిగా మారిన కాంగ్రెస్ అభ్య‌ర్థి కౌశిక్‌రెడ్డి వ్య‌వ‌హారం ఆ పార్టీలో క‌న్ఫ్యూజ‌న్‌కు దారి తీసింది. ఇటీవ‌ల జ‌రిగిన ఓ ప్రైవేట్ ఫంక్ష‌న్‌లో మంత్రి కేటీఆర్‌తో కౌశిక్‌రెడ్డి క్లోజ్‌గా ఉండ‌టం.. వారిద్ద‌రు చాలాసేపు మాట్లాడుకోవ‌డం.. అనుమానాస్ప‌దంగా మారింది. కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్‌లోకి జంప్ అవుతున్నాడంటూ ప్రచారం జ‌రుగుతుండ‌టం.. అలాంటిదేమీ లేద‌ని.. తాను కాంగ్రెస్ నుంచే పోటీ చేసి.. ఈట‌ల‌ను ఓడిస్తానంటూ యంగ్ లీడ‌ర్‌ కౌశిక్‌రెడ్డి స‌వాల్ చేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. హుజురాబాద్‌లో కౌశిక్‌రెడ్డి స్ట్రాంగ్ క్యాండిడేట్‌. గ‌త ఎన్నిక‌ల్లో 60వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఈట‌ల‌కు ల‌క్ష‌కు పైగా ఓట్లు వ‌చ్చాయి. ఈ లెక్క‌న‌.. ఆ ల‌క్ష ఓట్లు.. ఈసారి ఈట‌ల‌కు, టీఆర్ఎస్‌కు మ‌ధ్య చీలిపోతే.. కాంగ్రెస్‌ ఓట్లు ఎప్ప‌టిలానే ప‌డితే.. గెలుపు త‌న‌దేన‌నే ధీమా కౌశిక్‌రెడ్డిలో క‌నిపిస్తోంది. హుజురాబాద్ ఉప పోరు.. ఈట‌ల‌, టీఆర్ఎస్‌కు మ‌ధ్య జ‌రిగే పోరుగానే చూడ‌కూడ‌ద‌ని.. మ‌ధ్య‌లో కౌశిక్‌రెడ్డి ఉన్నాడ‌నే విష‌యం మ‌ర్చిపోవ‌ద్ద‌ని అంటున్నారు. హుజురాబాద్‌లో జ‌ర‌గ‌బోయేది ట్ర‌యాంగిల్ వార్ అని తేల్చి చెబుతున్నారు. 

ఇలా.. మూడు పార్టీలు.. మూడు వ‌ర్గాలు.. హుజురాబాద్ బైపోల్‌కు రెడీగా ఉండ‌టంతో.. ఎల‌క్ష‌న్ ఎప్పుడొచ్చినా స‌మ‌రమే అన్న‌ట్టుగా ఉంది సీన్‌. అయితే.. ఎన్నిక ఆల‌స్యం అయితే.. అధికార పార్టీకి కాస్త అడ్వాంటేజ్ అని చెబుతున్నారు. కానీ, ఆగ‌ష్టులోనే ఉప ఎన్నిక రాబోతోందంటూ ఢిల్లీ నుంచి స‌మాచారం లీక్ అవ‌డంతో.. స‌మ‌యం లేదు మిత్ర‌మా అంటూ అన్ని వ‌ర్గాలూ క‌త్తుల‌కు ప‌దును పెడుతున్నాయి. హుజురాబాద్‌ ఉప సంగ్రామానికి సై అంటున్నాయి.