లాక్‌డౌన్‌తో వైన్ షాపుల్లో ర‌ద్దీ

సోమ‌వారం రాత్రి 10 గంట‌ల‌కు లాక్‌డౌన్ స్టార్ట్‌. మ‌ళ్లీ సోమ‌వారం వ‌ర‌కూ స‌క‌లం క్లోజ్‌. అయ్యో.. బియ్యం, ప‌ప్పు, ఉప్పు ఎలా? అనే టెన్ష‌న్ వారిలో లేదు. అబ్బా.. వారం రోజుల పాటు మందు దొర‌క‌దుగా అనేది వారి ఆందోళ‌న‌. అందుకే, ఇలా ఢిల్లీ సీఎం లాక్‌డౌన్ విష‌యం ప్ర‌క‌టించారో లేదో.. అలా మందుబాబులంతా మ‌ద్యం షాపులకు పోటెత్తారు. లిక్క‌ర్ కోసం ఎండను లెక్క చేయ‌కుండా కిలోమీట‌ర్ల మేర క్యూ క‌ట్టారు. 

భౌతిక దూరం లేదు. మాస్కులు లేవు. మ‌ద్యం షాపుల ముందు తోపులాట‌లు. ఒక‌రిని ఒక‌రు నెట్టుకుంటూ.. ఎక్క‌డ ఆల‌స్య‌మైతే మందు అయిపోతుందోన‌నే భ‌యం వారిలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఫేవ‌రేట్ హీరో ఫ‌స్ట్ డే టికెట్ల‌కు ఎగ‌బ‌డిన‌ట్టు మందుకు ఎగ‌బ‌డుతున్నారు ఢిల్లీలోని మందుబాబులు. వారిని కంట్రోల్ చేయ‌లేక‌, మ‌ద్యం షాపు నిర్వాహ‌కులు, పోలీసులు చేతులెత్తేస్తున్నారు. కొన్ని చోట్ల గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఉన్న స్టాక్ అంతా ఊడ్చేశారు. లాక్‌డౌన్ కంటే మందు టెన్ష‌న్ ఎక్కువ‌గా ఉండ‌టం చూసి ఢిల్లీవాసులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మందుబాబులా.. మ‌జాకా...