TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో కోత‌లే కోత‌లు.. క‌రెంట్ క‌ట్‌ల‌తో జ‌నం బేజారు...

Published on: Thu Apr 7, 2022 11:50AM

అది న‌ర్సీప‌ట్నం ప్ర‌భుత్వ ఆసుప‌త్రి. అర్జెంటుగా ఓ గ‌ర్బిణీకి డెలివ‌రీ చేయాల్సి ఉంది. ఆప‌రేష‌న్ టైమ్ అవుతోంది. కానీ, హాస్పిట‌ల్‌లో క‌రెంట్ లేదు. వేళాపాళా లేకుండా ఎడాపెడా ప‌వ‌ర్ క‌ట్ల‌తో ఏపీ బేజార్ అవుతోంది. ఆ న‌ర్సీప‌ట్నం ఆసుప‌త్రిలోనూ క‌రెంట్ లేక‌పోవ‌డంతో.. ప‌గ‌టిపూటే చీక‌ట్లు అలుముకున్నాయి. మ‌రి, ఆప‌రేష‌న్ ఎలా చేయాలి? జ‌న‌రేట‌ర్ సౌక‌ర్యం కూడా లేక‌పోవ‌డంతో సెల్‌ఫోన్ వెలుగుల్లోనే ఆ డెలివ‌రీ చేశారు ప్ర‌భుత్వ వైద్యులు. ఏపీలో క‌రెంట్ కోత‌ల దుస్థితికి అద్దం ప‌డుతోంది న‌ర్సీప‌ట్నం ఆసుప‌త్రి ఉదంతం. 

జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలోనూ అంతే. కరెంట్ లేకపోవటంతో చంటి పిల్లలతో బాలింత‌లు తీవ్ర‌ ఇబ్బందులు పడుతున్నారు. సెల్‌ఫోన్ వెలుగుల్లో, విస‌న‌క‌ర్ర గాలుల‌తో నెట్టుకొస్తున్నారు. 

ఏపీకి ఎందుకింత దారుణ ప‌రిస్థితులు? ప‌క్క‌నే ఉన్న తెలంగాణ‌లో సెక‌న్ కూడా క‌రెంట్ పోకుండా ఉంటుంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం గంట‌ల త‌ర‌బ‌డి ఈ కరెంట్ కోత‌లేంటి? ఒక‌ప్పుడు మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంలో ఇంత‌టి అంధ‌కార దుస్థితి ఎందుకొచ్చింది? ఇంకెందుకు.. పాల‌కుల చేత‌గానిత‌న‌మే అంటున్నారు. జ‌గ‌న‌న్న అస‌మ‌ర్థ‌త‌తోనే జ‌నాల‌కు ఈ క‌రెంట్ టార్చ‌ర్ అని మండిప‌డుతున్నారు. 

అస‌లే ఎండాకాలం. ఉక్క‌బోత ఎక్కువ‌. చెమ‌ట‌లూ ఎక్కువే. ఫ్యాన్ లేనిదే క్ష‌ణం కూడా ఉండ‌లేని ప‌రిస్థితి. కానీ, ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన పాపానికి ఇలా ప‌వ‌ర్ కోసం పాకులాడాల్సి వ‌స్తోంది. ఎడాపెడా క‌రెంట్ కోసేస్తున్నారు. ఓ టైమ్ గ‌ట్రా ఏమీ లేదు. ఎప్పుడు గుర్తొచ్చే అప్పుడు విద్యుత్ ఆపేస్తున్నారు. ఆసుప‌త్రులు, సంస్థ‌లు, షాపులు, ఇళ్లు, ఆఫీసులు, ప్ర‌జ‌లు అంతా ఆగ‌మాగం..అయోమ‌యం..జ‌గ‌న్నాథం.

ఇదే స‌మ‌యంలో బుధ‌వారం రాత్రి.. విద్యుత్‌ కోతలు, భారీగా పెంచిన విద్యుత్‌ చార్జీలను నిరసిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రచారం చేశారు. రాత్రి సమయంలో కురగల్లు గ్రామంలో ఆయన పర్యటిస్తుండగా.. కరెంటు పోయింది. దీంతో లాంతరు చేతపట్టుకుని కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, బాదుడే బాదుడంటూ ముద్రించిన విసనకర్రలను ఇంటింటికీ పంపిణీ చేస్తూ లోకేశ్‌ నిరసన తెలిపారు. ఏడుసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజల నుంచి రూ.16 వేల కోట్లను ముక్కుపిండి వసూలు చేశారన్నారు. జగన్‌రెడ్డి విద్యుత్‌ చార్జీలను భారీగా పెంచడంతోపాటు అప్రకటిత కోతలను విధిస్తూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని మండిప‌డ్డారు లోకేశ్‌.