భారీగా పెరిగిన కరోనా కేసులు.. సంక్రాంతి ముందు డేంజర్ బెల్స్..
Published on: Tue Jan 11, 2022 4:45PM
కరోనా చాపకింద నీరులా చుట్టేస్తోంది. ఏది ఒమిక్రానో.. ఏది డెల్టానో.. వేరియంట్స్‌తో పనిలేకుండా కొవిడ్ కమ్మేస్తోంది. ముందు స్లో గా వచ్చిన కేసులు.. ఇప్పుడు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే ఏపీలో పాజిటివ్ కేసులు డబుల్ కావడం భయాందోళనలకు గురి చేస్తోంది.
గడిచిన 24 గంటల్లో 36,452 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 1,831 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో ప్రస్తుతం 7,195 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 467, విశాఖ జిల్లాలో 295, కృష్ణా జిల్లాలో 190, గుంటూరు జిల్లాలో 164, అనంతపురం జిల్లాలో 161, తూర్పు గోదావరిలో 84, కడప జిల్లాలో 20, నెల్లూరులో 129, శ్రీకాకుళం జిల్లాలో 122, విజయనగరంలో 40, పశ్చిమగోదావరిలో 57, ప్రకాశం జిల్లాలో 46, కర్నూలు జిల్లాలో 56 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
సంక్రాంతి ముందర ఇంత వేగంగా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు బెదిరిపోతున్నారు. ఇక పండగ సీజన్‌లో బంధువులు, స్నేహితుల రాకపోకలు.. సామూహిక వేడుకలతో కేసుల సంఖ్య ఇంకెంత భారీగా పెరుగుతుందోననే హడలి పోతున్నారు. మరోవైపు, ఈనెల 18 నుంచి జనవరి 31 వరకు.. రాత్రి కర్ఫ్యూ విధించింది ఏపీ ప్రభుత్వం.


