మందుబాబులకు వందనం.. ఖజానా నింపుతున్న పుణ్యాత్ములు
Published on: Thu Jan 13, 2022 10:46AM
తెలంగాణ ధనిక రాష్ట్రం ... అందులో సందేహం లేదు. అయితే రాష్ట్ర ఖజానాను నింపుతోంది మాత్రం మందు బాబులే ... ఖజనాలో చేరే ప్రతి రూపాయిలో 62 నుంచి 64 పైసలు మందుబాబుల కష్టార్జితమే..ట. అందుకే మందుబాబులకు వందనం అంటున్నారు అబ్కారీ అధికారులు. సంక్షేమ ఫలాలను అందుకుంటున్న సామాన్యులు.
రాష్ట్ర విభజనకి ముందు ఉమ్మడి రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే వార్షిక ఆదాయం ఎప్పుడూ రూ. 10 నుంచి 12 వేల కోట్లకు మించలేదు. కానీ, రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దినదిన ప్రవర్తమానంగా ఆబ్కారీ శాఖ ఆదాయం క్షణక్షణాభివృద్ధి చెందుతోంది..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారు తెలంగాణ నిర్మాణానికి మందు బాబుల కంట్రిబ్యూషన్ రూ. 30 వేల కోట్లు ఉంటుందని ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో రూ. 26 వేల కోట్లకు మాత్రమే పరిమిత అయిన అబ్కారీ ఆదాయం,ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకే రూ. 23 వేల కోట్లు దాటేసింది. డిసెంబర్లో మాదిరిగానే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో అదేస్థాయిలో రాబడి వస్తుందని, రూ. 8 వేల కోట్లకు తగ్గకుండా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే... ఈ ఆర్ధిక సంవత్సరం ఎక్సైజ్ శాఖ రాబడి రూ. 30 వేల కోట్లు దాటే అవకాశం ఉందని అంటున్నారు. డిసెంబర్లో వ్యాట్ ఆదాయం రికార్డుస్థాయిలో రూ. 15 వందల 35 కోట్లు వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో... మరో రూ. 8 వేల కోట్లు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే,రాష్ట్ర విభజన జరిగిన వెంటనే రాష్ట్రంలో మందుబాబుల సంఖ్య పెరిగి పోయిందా అంటే లేదు. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన తెరాస ప్రభుత్వం, గుడుంబాను కట్టడి చేయడం సహా అక్రమ మద్యం విక్రయాలకు చెక్ పెట్టడంతో ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగింది. అందుకు మద్యం ధరలు పెంచడం కలిసొచ్చింది. ఫలితంగా ప్రతి ఏడాది ఎక్సైజ్ ఆదాయం పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ ఆదాయంలో 62 నుంచి 64శాతం వరకు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ల ద్వారా ప్రభుత్వానికి చేరుతోంది. బార్లు, మద్యం దుకాణాలు, క్లబ్, పబ్లకు లైసెన్స్లు ఇవ్వడం ద్వారా ఖజానా నిండు కుండలా పొంగిపొర్లుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో మద్యం అమ్మకాలపై రూ. 850.52 కోట్ల వ్యాట్ ఆదాయం రాగా... డిసెంబరులో ఏకంగా రెట్టింపు అయ్యింది. దాదాపు రూ. 1,535 కోట్ల వరకు వచ్చింది. అయినా, అదీ చాలక ప్రభుత్వం అప్పులు చేస్తోంది అనుకోండి అది వేరే విషయం.


