TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

75% డిస్కౌంట్‌.. ట్రాఫిక్ చ‌లాన్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..

Published on: Wed Feb 23, 2022 5:53PM

తెలంగాణ‌ ట్రాఫిక్ పోలీసులు మ‌హా ఖ‌త‌ర్నాక్‌. గ‌ల్లీ చివ‌ర కాపు కాస్తారు. త‌ప్పించుకోలేని చోట చెక్ పాయింట్ పెడ‌తారు. ఇక‌, చ‌లాన్లు బాదుడే బాడుడు. లేదంటే, సింపుల్‌గా ఓ చోట నిలుచొని.. ట‌కీ ట‌కీమంటూ ఫోటోలు తీస్తుంటారు. మొబైల్‌కు మెసేజ్ వ‌చ్చాక కానీ తెలీదు ఫైన్ ప‌డింద‌ని. వాహ‌న‌దారుల‌కు చ‌లాన్లు వేయ‌డంలో మ‌న ట్రాఫికోళ్లు మ‌హా ఎక్స్‌ప‌ర్ట్స్‌. బండి ఆపారంటే.. ఏదో ఒక ఫైన్ వేయాల్సిందే. ఏదో ఒక కొర్రీ పెట్టి.. ఎంతోకొంత చ‌లాన్ రాయాల్సిందే. హ‌మ్మ‌య్యా.. పోలీసోళ్లు ఎవ‌రూ లేరని సిగ్న‌ల్స్ జంప్ చేస్తే.. సీసీకెమెరాల్లో క్యాచ్ చేసి మ‌రీ చ‌లాన్లు పంపిస్తున్నారు. బైక్‌పై వెనుక కూర్చున్న వాళ్లు హెల్మెట్ పెట్టుకోక‌పోయినా వ‌ద‌ల‌డం లేదు. 

ఇలా ఏళ్లుగా చ‌లాన్లు అయితే వేస్తున్నారు కానీ.. అవి క‌ట్టే వారు కొంద‌రే. వాటిని వ‌సూలు చేయ‌డం ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కి చానా క‌ష్టం అవుతోంది. అందుకే, ఈ మ‌ధ్య ట్రాఫిక్ పోలీసులు వాహ‌నాలు ఆపుతూ.. కేవ‌లం పాత చ‌లాన్లు మాత్ర‌మే వ‌సూలు చేస్తున్నారు. అయినా.. పాత బాకీలు త‌డిసి మోపుడ‌య్యాయి. ఏకంగా 600 కోట్ల రూపాయ‌ల పెండింగ్‌ చ‌లాన్లు ఉన్నాయి. 

ఇక‌, ఇలా అయితే లాభం లేద‌నుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. అందుకే, ఎంతోకొంత వ‌సూలు చేయాల‌ని.. బంప‌ర్ డిస్కౌంట్ రెడీ చేశారు. రండి బాబు రండి.. క‌ట్టండి బాబూ క‌ట్టండి.. ఆల‌సించినా ఆశాభంగం అంటూ.. భారీ ఆఫ‌ర్ ఇవ్వ‌నున్నారు. టూ వీల‌ర్ అయితే.. మొత్తం క‌ట్టాల్సిన‌ చ‌లాన్ల‌లో 25శాతం క‌డితే చాల‌ట‌. అంటే.. 75శాతం మాఫీ. భ‌లే చౌక‌ బేరం క‌దా. అదే, కార్ల‌కు 50 శాతం, ఆర్టీసీ బ‌స్సుల‌కు 30శాతం, తోపుడు బండ్ల‌కు 20శాతం చెల్లిస్తే స‌రిపోతుంది.. మిగ‌తా మొత్తం ర‌ద్దు అవుతుంద‌ని బంప‌ర్ డిస్కౌంట్ ఇవ్వ‌నున్నారు. 

ఆన్‌లైన్, మీసేవ, గేట్‌వేల ద్వారా చెల్లింపునకు అవకాశం కల్పిస్తున్నారు. మార్చి 1 నుంచి 30 వరకు ట్రాఫిక్‌ పొలీసులు స్పెష‌ల్‌ డ్రైవ్ నిర్వహించి.. డిస్కౌంట్‌తో పాత బ‌కాయిలు వ‌సూలు చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫైల్ డీజీపీ టేబుల్ మీద ఉంది. త్వ‌ర‌లోనే నిర్ణ‌యం రానుంది. మ‌రి, మ‌న ముదుర్లు.. ఇంత పెద్ద డిస్కౌంట్ ఇచ్చినా పెండింగ్ చ‌లాన్లు క‌డ‌తారా? వెయ్యి రూపాయ‌ల హెల్మెంట్‌కు క‌క్కుర్తి ప‌డి.. 10 వేల వ‌ర‌కూ వ‌రుస‌ ఫైన్లు వేయించుకున్న ఘ‌నులూ ఉన్నారు. అలాంటోళ్లు.. డిస్కౌంట్ ఇస్తున్నారు క‌దాని.. క్యూలో నిల్చొని పాత బ‌కాయిలు చెల్లించేటంత మంచి మ‌నుషులు కాక‌పోవ‌చ్చు మ‌నోళ్లు. కానీ, పోలీసులు ఇస్తున్న‌ది మాత్రం బంప‌ర్‌ ఆఫ‌ర్.. క‌ట్టేస్తే పోలా. ఆ ట్రాఫికోళ్లను త‌ప్పించుకుని తిరిగే టార్చ‌ర్ త‌ప్పుతుందిగా.