TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో క‌రెంట్‌ చార్జీల షాక్‌.. జ‌గ‌న‌న్న బాదుడు ప‌థ‌కం!?

Published on: Wed Mar 30, 2022 1:15PM

జ‌గ‌న‌న్న మ‌రో దెబ్బేశాడు. క‌రెంట్ ఛార్జీలు భారీగా పెంచేశారు. ఇప్ప‌టికే తెలంగాణ స‌ర్కారు విద్యుత్ చార్జీలు పెంచ‌గా.. ఇదే అద‌నుగా ఎండాకాలం చూసి మ‌రీ వాత పెట్టేశారు. క‌రెంట్ కోత‌లు లేకుండా నిరంత‌రాయం విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌లేని, చేత‌గాని ప్ర‌భుత్వం.. విద్యుత్ బిల్లులు పెంచేందుకు మాత్రం సై సై అంటూ ముందుకొచ్చింద‌ని అంటున్నారు. వేస‌విలో వినియోగం ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలిసీ.. ఇప్పుడు పెంచితేనే బాగా దోచేసుకోవ‌చ్చ‌ని లెక్క‌లేసి.. స‌డెన్‌గా క‌రెంట్ చార్జీలు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది ఏపీ ప్ర‌భుత్వం. ఇటు కోత‌లు.. అటు వాత‌లు.. ఇక ఏపీలో క‌రెంట్ బిల్లుల‌తో ద‌బిడి దిబిడే.

ఏపీలో భారీగా విద్యుత్ చార్జీలు పెంచుతూ ఈఆర్సీ నిర్ణ‌యం తీసుకుంది. ఇళ్ల‌లో వాడే క‌రెంట్‌కు 30 యూనిట్ల వర‌కు.. యూనిట్‌కు 45 పైసలు పెంచారు. 31 నుంచి 75 యూనిట్ల వారికి.. యూనిట్‌కు 95 పైసలు పెంచేచారు. అలాగే 126 నుంచి 225 యూనిట్లు వాడితే.. యూనిట్‌కు రూ.1.57 పెర‌గ‌నుంది. 226 నుంచి 400 యూనిట్ల వాడే వారికి.. యూనిట్‌కు రూ.1.16 పెంచారు. 400 యూనిట్లపైన వారికి యూనిట్‌కు 55 పైస‌లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చినట్లు ఏపీఈఆర్సీ చైర్మన్ వెల్లడించారు.

అయితే.. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాలు అధికంగా ఉండే స్లాబ్ రేట్ల‌కు భారీగా క‌రెంట్ చార్జీలు పెంచ‌డం.. సంప‌న్నులు, ఎక్కువ విద్యుత్ వాడే వారికి త‌క్కువ‌గా చార్జీలు పెంచ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జ‌నాభాలో అధిక శాతం మంది 126-225, 226-400 యూనిట్లు వాడే వారే ఉంటారు. వీరంతా లోయ‌ర్‌, అప్ప‌ర్ మిడిల్ క్లాస్ వ‌ర్గాలే. వారికి యూనిట్‌కి ఏకంగా రూ.1.57, రూ.1.16 పెంచ‌గా.. 400 యూనిట్ల‌కంటే ఎక్కువ క‌రెంట్ వాడే రిచ్ పీపుల్స్‌కు మాత్రం యూనిట్‌కు కేవ‌లం 55 పైస‌లు పెంచ‌డంపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.