విపత్తులోనూ వ్యాపారబుద్ధేనా?

 

హుదూద్ తుఫాను కారణంగా విశాఖపట్టణం ఎదుర్కొన్న పెను విపత్తు దేశవ్యాప్తంగా అందర్నీ కదిలిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలోనే మకాం వేసి అక్కడ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ విశాఖ సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తుఫాను ధాటికి విశాఖపట్టణం అతలాకుతలం అయిపోయింది. చాలామంది సర్వం కోల్పోయి నడి రోడ్డున నిలబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో బయటి ప్రాంతాల వారే విశాఖను చూసి జాలిపడుతుంటే, విశాఖలో వ్యాపారులు మాత్రం ఈ విపత్తుని క్యాష్ చేసుకోవాలని తపిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో జనం రోడ్లమీదకి వచ్చారు. నిత్యావసరాల కోసం, పెట్రోలు, డీజిల్ కోసం రోడ్ల మీదకు వచ్చిన జనం దుకాణాల్లో ఆయా వస్తువులకు వ్యాపారులు చెబుతున్న రేట్లు విని నోళ్ళు తెరిచారు. మామూలుగా అమ్మే ధరకంటే రెట్టింపు ధరలు అమ్ముతున్నారు. పెట్రోల్, డీజిల్ ఏకంగా వందరూపాయల రౌండ్ ఫిగర్ చేసేశారు. కోడిగుడ్డు కొనాలన్నా కళ్ళలో గుడ్లు తిరిగిపోయే రేట్లు చెప్పారు. ఈ విషయాలన్నీ గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చేసరికి కొంతమంది దారికి వచ్చారు. మరికొంతమంది తమ వ్యాపార ధోరణిలోనే తమ ఇష్టం వచ్చిన ధరకు విక్రయాలు చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గపు వ్యాపారులున్న వైజాగ్‌కి తెలుగు ప్రజలందరి తరఫున ప్రగాఢ సానుభూతి. ఇలాంటి వ్యాపారులున్న వైజాగ్‌ భవిష్యత్తులో స్మార్ట్ సిటీ అవడం వల్ల ఉపయోగం ఏమిటి? అడుగడుగునా పరిస్థితులను ‘స్మార్ట్’గా క్యాష్ చేసుకునేవాళ్ళు తయారైనప్పుడు ఏ నగరమైనా ఎంత అభివృద్ధి చెందినా ఉపయోగం ఏమిటి? ఇలాంటి విపత్తు సమయంలో కూడా వ్యాపార బుద్ధితో ఆలోచించిన వారిని ఏమనాలి? అలాంటి వారికి బుద్ధొచ్చేట్టు చేయి దేవుడా అని ప్రార్థించడం తప్ప ఎవరూ ఏమీ చేయలేరు.