TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హుదుద్ తుఫాను: తోటలకు తీరని నష్టం

Published on: Mon Oct 20, 2014 4:10PM

 

ఉత్తరాంధ్ర మీద కనీవినీ ఎరుగని స్థాయిలో విరుచుకుపడిన హుదుద్ తుఫాను ఉత్తరాంధ్రకు తీరని నష్టాన్ని మిగిల్చింది. విశాఖపట్నం అస్తవ్యస్తం కావడం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజలకు భారీ నష్టం జరగడం అలా వుంచితే, రోజులు గడుస్తున్నకొద్దీ హుదుద్ తుఫాను చేసిన నష్టాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో భారీ స్థాయిలో జరుగుతున్న తోటల పెంపకానికి ఊహించని నష్టాన్ని ఈ తుఫాను కలిగించింది. అరవై కిలోమీటర్ల తీర ప్రాంతంలో పళ్ళతోటలు భారీగా విధ్వంసానికి గురయ్యాయి.

 

విజయనగరం జిల్లా కొత్తవలస దగ్గర్నుంచి విశాఖపట్నం జిల్లా తలపాలెం, ద్వారపూడి ప్రాంతాల్లో సపోటా, కొబ్బరి, జీడిమామిడి తోటలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. మళ్ళీ చిన్న చిన్న మొక్కలు పెంచుకుని నాలుగైదు ఏళ్ళ తర్వాతే మళ్ళీ ఫలసాయం చూడగలమని ఈ ప్రాంతాల్లోని తోటల పెంపకందార్లు చెబుతున్నారు. గుడ్డిలో మెల్లగా పెద్ద పెద్ద పర్వతాలు అడ్డుగా వున్న కొన్ని గ్రామాల్లో మాత్రం పండ్ల తోటలు సురక్షితంగా వున్నాయి. ఆ పర్వతాలే తమ తోటలను కాపాడాయని స్థానికులు చెబుతున్నారు.

 

మొత్తమ్మీద ఉత్తరాంధ్రలోని రెండు లక్షల ఇరవై వేల ఎకరాలలో పండ్ల తోటలు నేటమట్టమైపోయాయని తెలుస్తోంది. ఈ నష్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హార్టీకల్చర్ డిపార్ట్‌మెంట్ లెక్కలు కడుతోంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటే తప్ప ఉత్తరాంధ్రలో తోటల పెంపకందార్లు తిరిగి నిలదొక్కుకునే పరిస్థితులు కనిపించడం లేదు.