హుధుద్ విలయానికి మూడేళ్లు

12.10.2014 ఈ రోజు విశాఖప్రజలే కాదు ఏపీ వాసులకు జీవితాంతం గుర్తుంటుంది. సరిగ్గా ఇదే రోజున ప్రకృతి సాగర నగరం విశాఖ మీద కన్నెర్ర చేసి విలయతాండవం చేసింది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు ఎక్కడ చూసినా కూలిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్, సెల్‌ఫోన్ టవర్లు, హోర్డింగ్‌లే దర్శనమిచ్చాయి. ప్రచండ గాలులు, వర్షపు తాకిడికి ఐదుగురు మరణించారు. తీర ప్రాంతం వెంట పలుచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో వందలాది గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. తుఫానుకు ముందు పచ్చని చెట్లతో కళకళలాడిన విశాఖ కొద్దిగంటల్లోనే ఏడారిలా మారిపోయింది.

 

తిరిగి విశాఖ కోలుకోవాలంటే కనీసం పదేళ్లు పడుతుందని అంచనాలు.. ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధంగా లేదంటూ ప్రతిపక్షం నుంచి వ్యంగ్యాస్త్రాలు. అయినా సవాళ్ల మీద స్వారీ చేయడాన్ని ఇష్టంగా మలుచుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కవోని దీక్షకు కాలం సైతం తలవంచింది. అంతటి భారీ తుఫాను పూర్తిగా తగ్గకముందే హైదరాబాద్ నుంచి విశాఖ బయలుదేరి.. రోజుల తరబడి బస్సునే తన ఇల్లు, ఆఫీసుగా చేసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించారు. దీంతో రికార్డు సమయంలోనే విశాఖ నిలదొక్కుకుంది.

 

ఎన్ని రోజులకు వస్తుందో అనుకొన్న విద్యుత్‌ కొన్ని గంటల్లోనే వచ్చింది. నిత్యావసర వస్తువులకు కొరత లేకుండా చూసుకున్నారు. కూలిన ప్రతి చెట్టు స్థానంలో మొక్కలు నాటుకుంటూ వచ్చారు. హుధుద్ ఆనవాళ్లను చెరిపివేసేలా నగరం మొత్తం పచ్చదనం పరుచుకుంది.. దీని తర్వాత సీఎం విశాఖ అభివృద్ధి మీద దృష్టిపెట్టారు. పెద్ద పెద్ద సదస్సులను విశాఖలో ఏర్పాటు చేసి.. దానికి దేశవ్యాప్తంగా పేరొందిన పారిశ్రామిక దిగ్గజాలను రప్పించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, బెస్ట్ బిజినెస్ పాలసీల ద్వారా ఐటీ కంపెనీలను ఉక్కు నగరం ముంగిట నిలబెట్టారు.

 

నాడు హుధుద్ వల్ల కూలిన చెట్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని భావించిన సీఎం దీపావళి పండుగ జరుపుకొవద్దు అని పిలుపునిచ్చారు. నేడు హుధుద్ దెబ్బ నుంచి కోలుకోని దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖ పరుగులు పెడుతుండటంతో మూడేళ్ల తర్వాత అదే దీపావళీని చేసుకోనున్నారు చంద్రబాబు. ఆర్కే బీచ్‌లో జరిగే వేడుకల్లో వీధి బాలలు, అనాధ ఆశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులతో కలిసి సీఎం పండుగ జరుపుకుంటారు.