ఆనాడు బాబు, లోకేష్ పై విమర్శల్నీ వట్టివేనా? అలాగైతే జగన్ కు శేఖర్ రెడ్డి ఎన్ని కోట్లు ఇచ్చారు? 

 

జగన్మోహన్ రెడ్డి... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శేఖర్ రెడ్డిపై వైసీపీ పెద్దఎత్తున విమర్శలు గుప్పించింది. నోట్ల రద్దు సమయంలో శేఖర్ రెడ్డి ఇంట్లో వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు పట్టుబడటంతో, జగన్ సహా వైసీపీ నేతలంతా చంద్రబాబుకు లోకేష్ కు లింకు పెట్టి ఆరోపణలు చేశారు. ఆనాటి టీటీడీ పాలక మండలిలో సభ్యుడుగా ఉండటంతో, శేఖర్ రెడ్డి.... చంద్రబాబుకు బినామీ అని, లోకేష్ కు ఆత్మీయుడని విమర్శించారు. అందుకే శేఖర్ రెడ్డిని టీటీడీ సభ్యుడిగా నియమించారంటూ స్వయంగా జగన్మోహన్ రెడ్డే తన ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్లు కూడా చేశారు. ఇక సాక్షి టీవీ, దినపత్రికలో అయినా, శేఖర్ రెడ్డి-చంద్రబాబు-లోకేష్ పై అనేక కథనాలు వండివర్చారు. ఎవరికీ బినామీ, పచ్చ పుట్టలో నల్ల త్రాచు అంటూ వరుస కథనాలు ప్రసారం చేశారు. అంతేకాదు నారా లోకేష్ కు ఈ శేఖర్ రెడ్డి వంద కోట్ల రూపాయలు చెల్లించి టీటీడీ సభ్యుడు అయ్యాడంటూ అంబటి రాంబాబు చేత ప్రెస్ మీట్లు పెట్టించి రచ్చరచ్చ చేశారు. ఇక చంద్రబాబుతో శేఖర్ రెడ్డి దిగిన ఫొటోలను మెయిన్ పేజీలో ముద్రించి రకరకాల కథనాలు అల్లారు. అసలు టీటీడీ బోర్డులో శేఖర్ రెడ్డిని ఏ అర్హతతో నియమించారో చెప్పాలంటూ వైసీపీ నేతలు అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే, ఏ శేఖర్ రెడ్డినైతే చంద్రబాబుకి బినామీ, లోకేష్ కి ఆత్మీయుడంటూ ఆరోపణలు చేశారో... ఇఫ్పుడదే శేఖర్ రెడ్డికి... జగన్ ప్రభుత్వం టీటీడీ చోటు కల్పించింది. అంతేకాదు అనుమానం రాకుండా శేఖర్ రెడ్డి పేరును శేఖర్ ఏజే అంటూ మార్చి జీవో ఇచ్చారు. మరి ఆనాడు చంద్రబాబుకు బినామీ, లోకేష్ కు ఆత్మీయుడైన ఈ శేఖర్ రెడ్డి... ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి టీటీడీ మెంబర్ అయ్యాడని అటు విపక్షాలు... ఇటు భక్తులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు-శేఖర్ రెడ్డిది బలమైన బంధం, చంద్రబాబుకి శేఖర్ రెడ్డి బినామీ అంటూ ఆనాడు స్వయంగా ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి ఇఫ్పుడేం సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు. 

అయితే, శేఖర్ రెడ్డి పేరును జీవోలో శేఖర్ ఏజేగా మార్చి రాయడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్స్, సాక్షి మీడియా కథనాలు, వీడియోలు, వైసీపీ లీడర్స్ స్టేట్ మెంట్స్ ఇలా అన్ని క్లిప్పింగ్స్ బయటపెడుతూ... జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా, శేఖర్ రెడ్డికి చంద్రబాబుకి లింకు పెడుతూ పేజీలకు పేజీలు రాసిన సాక్షి మీడియా, పెద్దఎత్తున విమర్శలు గుప్పించిన జగన్ బృందం ఇప్పుడేం సమాధానం చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు శేఖర్ రెడ్డి పేరును జీవోలో శేఖర్ ఏజేగా రాయడాన్ని బట్టే, ఏదో మతలబు ఉందనేది తెలుస్తుందంటున్నారు. పేరును మార్చితే గుర్తుపట్టలేకపోవడానికి ప్రజలేమైనా అంత అమాయకులనుకుంటున్నారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. శేఖర్ రెడ్డి పేరు మార్చడంతోనే, జగన్ ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపిందని, పైగా ఆనాడు చంద్రబాబు, నారా లోకేష్ పై ఆరోపణలన్నీ వట్టివేనని తేలిపోయిందని అంటున్నారు.

మొత్తానికి ఆనాడు జగన్ అండ్ వైసీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్ పై చేసిన ఆరోపణలన్నీ తప్పుడవేనని భావించాల్సి ఉంటుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బాబు. లోకేష్ పై బురదజల్లారనేది తేటతెల్లమవుతోంది. మరి ఆనాడు వైసీపీ ఆరోపించినట్లు... వంద కోట్లతో టీటీడీ సభ్యత్వాన్ని శేఖర్ రెడ్డి కొనుక్కుంటే... ఇఫ్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకెన్ని కోట్లు ఇచ్చాడోనని నెటిజన్లు, భక్తులు, ప్రజలు ప్రశ్నిన్నారు. మరి ఈ ప్రశ్నలకు జగన్ అండ్ వైసీపీ లీడర్స్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.