ఇలాంటి మాటలెందుకు!

 

మనిషికి మాటే పరికరం. ఒక మనిషితో కలవాలన్నా, ఓ మనిషి మనసు విరవాలన్నా మాటతోనే సాధ్యమవుతుంది. అందుకే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు పెద్దలు. విల్లు నుంచి వచ్చిన బాణం, నోటి నుంచి వెలువడిన మాట వెనక్కి రావడం కష్టం కాబట్టి... ఆ జాగ్రత్త ముందే ఉండాలంటారు. ఎవరు ఎలా మాట్లాడతారు అనేది వారి నేర్పుని బట్టీ, వ్యక్తిత్వాన్ని బట్టీ ఆధారపడి ఉండవచ్చు. కానీ సంభాషణల్లో కొన్ని రకాల మాటలు లేకపోవడమే సంస్కారం అనిపించుకుంటుంది.

 

పరోక్షపు ఎత్తిపొడుపులు

కొంతమందికి కోపం వస్తే దానిని నేరుగా వ్యక్తీకరించి విషయాన్ని తేల్చుకోరు. పరోక్షంగా సూటీపోటీ మాటలు అంటూ ఉంటారు. పిల్లి మీదా కుక్క మీదా పెట్టి దెప్పి పొడుస్తూ ఉంటారు. తమ మాటలు తగలాల్సినవారికి గుచ్చుకున్నాయి కదా అని వీరు సంబరపడిపోవచ్చుగాక. కానీ ఆ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించినవారి మనసు మాత్రం తీవ్రంగా నొచ్చుకుంటుంది. నేరుగా అనే మాటలకంటే ఇలాంటి మాటలే ఎక్కువగా నొప్పిస్తాయి. ఆ మాటలు అన్న మనిషి పట్ల మనసులో ఓ చెడు అభిప్రాయాన్ని కలగచేస్తాయి.

 

వ్యక్తిగత వివరాలు

అదేమిటో గానీ.. కొంతమంది పరిచయం అయిన కొద్దిసేపట్లోనే మీ జీతం ఎంత? మీ కులం ఏమిటి? వంటి వ్యక్తిగత వివరాలను అడిగేస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే హద్దులు దాటుకుని ఇంట్లోని వివరాలను సైతం రాబట్టేందుకు ఆబగా ప్రయత్నిస్తారు. అవతలివారితో మనకు ఎంతవరకు చనువు ఉంది! వారి వ్యక్తిగత విషయాలలో మన జోక్యం ఎంతవరకు ఉండాలి! అన్న ఆలోచన లేకపోతే ఎంతటి పెద్దవారి మీదైనా ప్రతికూల అభిప్రాయమే ఏర్పడుతుంది.

 

ఉచిత సలహాలు

విచక్షణ ఉన్న ప్రతివారికీ తన జీవితాన్ని ఎలా నడుపుకోవాలి అన్న అవగాహన ఉంటుంది. మరీ అవసరం అనుకుంటే అవతలివారిని సలహా అడుగుతాడు. అలాంటి సమయంలో మనకి తోచిన సలహాని ఇవ్వడంలో తప్పులేదు కానీ... అవతలి మనిషి జీవితం ఎలా నడవాలో మనమే సలహా ఇచ్చేందుకు ప్రయత్నిస్తే భంగపడక తప్పదు. ‘మీ నాన్నాగారిని మీతో ఉంచుకోకుండా పంపేయవచ్చుగా!’, ‘మీ కొడుకు ఇంజినీరింగ్ కాకుండా డాక్టరు చదివించవచ్చుగా!’, ‘మీరు ఉద్యోగం మానేసి వ్యాపారం పెట్టుకోవచ్చుగా!’ అంటూ ఇచ్చే సలహాల దగ్గర్నుంచీ పంటి నొప్పికి ఏం వాడాలి, పొట్ట తగ్గడానికి ఏం చేయాలి వరకూ ఇచ్చే సవాలక్ష సలహాలు స్నేహ బంధాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. సలహా అనేది ఒక ఆయుధం. అది అవసరం అనుకున్నప్పుడే ప్రయోగించాలి. లేకపోతే దానివల్ల వినాశనం తప్పదు.

 

సోత్కర్ష

ప్రతి ఒక్కరి జీవితమూ విలువైనదే! అందులో అనుమానమేమీ లేదు. కొందరు కాస్త ఎక్కువ శ్రమపడి పైకి రావచ్చు. ఇంకొందరు అడ్డూఅదుపూ లేకుండా డబ్బు సంపాదిస్తూ ఉండవచ్చు. ఇలాంటి వారందరికీ తమ జీవితాన్ని చూసుకున్నప్పుడు చాలా గర్వంగా ఉండటం సహజం. కొండొకచో మిగతా వారిని చూస్తే చులకనా సహజమే! కానీ నిరంతరం తమ ఆత్మకథ గురించి కథలు కథలుగా డప్పు కొట్టుకుంటూ ఉంటే వినేవారి చెవులు చిల్లులుపడక తప్పదు. మొహమాటం కోసం మొహం మీద చిరునవ్వు పులుముకున్నా.... ఇదెక్కడి ఖర్మరా బాబూ అని తిట్టుకోకా తప్పదు.

 

పుకార్లు

మనకి రూఢి కాని విషయం, అందునా ఇంకొకరి గురించి చెడుగా చెప్పుకునే విషయం, పైగా ఇతరులు ఎవ్వరికీ ఉపయోగం లేని విషయం... ఓ పనికిమాలిన పుకారు కాక మరేమవుతుంది. ఇలాంటివాటి వల్ల ఇసుమంతైనా ఉపయోగం లేకపోగా పనికిమాలిన చెత్తని పంచిన మకిలి మాత్రం మనకి అంటుకుపోతుంది. పైగా ఇలాంటి పుకారు వల్ల ఒకోసారి సదరు మనిషి జీవితమే చిక్కుల్లో పడిపోతుంది. మనమూ వివాదాల్లోకి ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

 

ఇవే కాదు! గొప్ప కోసం అబద్ధాలు చెప్పడం, ఇతరులతో పోల్చి చూడటం, వెకిలి పదాలు ప్రయోగించడం, తాత్కాలికంగా పైచేయి సాధించేందుకు అవతలి మనిషిని ఎగతాళి చేయడం వంటి లక్షణాలని మన సంభాషణల నుంచి దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే అరగంటలో ముగిసిపోయే సంభాషణ కంటే కలకాలం నిలిచిపోయే బంధమే ముఖ్యం కదా! తాత్కాలికంగా తృప్తి పడే అహంకారంకన్నా, చెదిరిపోని సంస్కారం విలువైనది కదా!

 

 

- నిర్జర.