మొబైల్‌తో అద్భుతమైన ఫొటోలు తీయవచ్చు

 

ఒకప్పుడు ఫొటో తీయాలంటే పెద్ద ప్రహసనం! కెమెరా మెడలో తగిలించుకోవాలి, దాన్లో రీలు ఎంతవరకూ వచ్చిందో చూసుకోవాలి, బ్యాటరీలు పనిచేస్తున్నాయో లేదో గమనించుకోవాలి... ఇంత చేసినా ఫొటో తీసేటప్పుడు కెమెరా కాస్త కదిలిందంటే రీలు వృధా అయిపోయినట్లే! డిజిటల్‌ కెమెరాలు వచ్చాక ఈ బాధలన్నీ తీరిపోయాయి. ఇక ప్రతి చేతిలోనూ ఓ సెల్‌ఫోనూ, ఆ సెల్‌ఫోనుకి ఓ కెమెరా ఉన్న ఈ కాలంలో ఫొటో అంటే కన్నుమూసి తెరిచినంత తేలికైపోయింది. మరి అలాంటి ఫొటోలు అద్భుతంగా రావాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే....

 

రెజల్యూషన్‌

ఫోన్‌ చేతిలోకి వచ్చిన తరువాత అందులో కెమెరాకి సంబంధించిన డిఫాల్ట్‌ సెట్టింగ్స్‌ జోలికి పోము. నిజానికి ఫోన్‌ రెజల్యూషన్‌, ఇమేజ్‌ క్వాలిటీ వంటి ఆప్షన్స్‌లో మార్పులు చేయడం ద్వారా నాణ్యమైన ఫొటోలు తీయవచ్చు. ఒక ఫోటోని ఎంత స్పష్టంగా తీయవచ్చో ఈ ఆప్షన్స్‌ ద్వారా నిర్ణయించవచ్చు. ఫోన్లో 2048*1536 వరకూ రిజల్యూషన్‌ అందుబాటులో ఉంటే కేవలం 320*240 రిజల్యూషన్‌తో తీయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.

 

ప్రత్యేకమైన ఆప్షన్లు/ యాప్స్‌

ఒక 50 మంది వరుసగా నిలబడి ఉంటే... వారందరినీ ఒకే ఫొటోలో ఎలా బంధించగలం? ఫొటో తీశాక కళ్లలో ఎరుపుదనం కనిపిస్తే ఏం చేయాలి?... ఇలాంటి సమస్యలెన్నో మనకి ఎదురుపడుతుంటాయి. ఇలాంటి సవాలక్ష సమస్యలకి ఫోన్లో ప్రత్యేకమైన ఆప్షన్లు ఉంటాయి. ఉదాహరణకు పనోరమా అనే ఆప్షన్ను ఎంచుకోవడం ద్వారా పక్కపక్కనే ఉన్న దృశ్యాలను ఫోటో తీసి ఒక్కే ఫోటో కిందకి మార్చవచ్చు. ‘రెడ్‌ ఐ రిమూవల్‌’ అనే ఆప్షన్ వాడి కళ్లలో ఎరుపుదనం తొలగించవచ్చు. మన ఫోన్లో ఇలాంటి సౌకర్యాలు ఏమేం ఉన్నాయో ఒకసారి వరుసపెట్టి చూసుకోవడం మంచిది. ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి ఉన్నవారికి వేలాది యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

 

వెనక్కి తగ్గేది లేదు

ఇప్పుడు మన ఫోన్లలో కావల్సినంత మెమరీ ఉంటోంది. అవసరం అనుకుంటే ఎప్పటికప్పుడు దాన్ని ఖాళీ చేయవచ్చు కూడా! కాబట్టి మంచి ఫొటో రావాలి అనుకున్నప్పుడు ఏమాత్రం సందేహించకుండా వరసపెట్టి ఫోటోలు తీసేయడమే! ముఖ్యంగా పిల్లల్ని సహజంగా ఫొటో తీయాలన్నా, కదిలే వస్తువులని బంధించాలన్నా వెంటవెంటనే ఫోటోలు తీస్తుండాలి. ఇందుకోసం షట్టర్ స్పీడ్‌ ఎక్కువగా కెమెరాలను ఎంచుకుంటే దృశ్యాన్ని త్వరగా బంధించే అవకాశం ఉంటుంది.

 

జూమ్‌ వద్దు

కాస్త దూరంగా ఉండే దృశ్యాన్ని బంధించేందుకు జూమ్‌ ఆప్షన్‌ వాడుతుంటాం. నిజానికి మొబైల్‌ ఫోన్లలో ఎక్కువగా ‘డిజిటల్‌ జూమ్‌’ మాత్రమే ఉంటుంది. అంటే మీరు జూమ్‌ చేయాలనుకున్న దృశ్యం కాస్త దగ్గరగా కనిపిస్తుందే కానీ, కెమెరాలోని లెన్స్‌లో ఏమాత్రం తేడా రాదు. దీని వలన ఫొటోలోని రిజల్యూషన్ తగ్గిపోయి జూమ్‌ చేసిన వస్తువు మసకగా కనిపిస్తుంది. దీనికంటే మంచి రెజల్యూషన్‌తో ఫొటో తీసి కావల్సినంత మేర ఎన్‌లార్జ్ చేసుకోవడమే ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది.

 

చీకటి వెలుగులు

ఫొటోగ్రఫీ అంటేనే చీకటివెలుగులతో గీసే చిత్రం. పైగా మొబైల్‌ ఫోన్లలో ఉండే ఫ్లాష్‌ ప్రభావం పెద్దగా ఉండదు. కాబట్టి మంచి ఫొటో రావాలంటే ఎంత వెలుతురు ఉండాలో గ్రహించడం అవసరం. తరచూ ఫొటోలు తీస్తూ ఉంటే ఈ నేర్పు వచ్చేస్తుంది. సూర్యరశ్మి మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ లేని సమయంలో తీసే ఫొటోలు సహజంగా కనిపిస్తాయి. ఫ్లాష్‌ లేదా ఇతరత్రా కృత్రిమమైన వెలుగుతో తీసిన ఫొటోల కంటే సహజమైన వెలుతురులో దిగిన ఫొటోలు అద్భుతంగా వస్తాయి.

 

ఎడిటింగ్

చేతిలో ఫోన్‌ ఉంది కదా అని చకచకా ఫొటోలు తీసేయడమో, ఫొటోలు తీశాం కదా అని సోషల్ మీడియాలో పంచేసుకోవడమో చేస్తుంటాం. కానీ ఫొటోని ఎడిటింగ్ చేయడం కూడా గొప్ప కళే అని మర్చిపోతుంటాం. ఫొటోలోని సహజత్వం ఏమాత్రం చెడకుండా అందులోని చిన్నచిన్న లోపాలను సవరించగలిగితే జీవితాంతం మిగిలిపోయే జ్ఞాపకంగా ఓ ఫొటో మారిపోతుంది. అందుకోసం ‘ఫొటోషాప్’ వంటి అప్లికేషన్లు ఎలాగూ మనకి అందుబాటులో ఉన్నాయి.

 

ఇవే కాదు! ఫొటోని ల్యాండ్‌స్కేప్‌లో తీయాలా పోర్ట్రెయిట్‌లో తీయాలా; కెమెరా లెన్స్‌ శుభ్రంగా ఉందా లేదా; బ్రైట్‌నెస ఎంత ఉండాలి.. ఇలా ఫొటోలకి సంబంధించి ఒకో ఎంపికతోనూ ప్రయోగాలు చేస్తూ పోతే ఒక సాధారణ మొబైల్‌ ఫోన్‌తో కూడా అద్భుతమైన ఫొటోలు తీయవచ్చు.

 

- నిర్జర.