అవమానాన్ని ఎదుర్కోవడం ఎలా!

 

రామాయణంలో లక్ష్మణుడు, శూర్పణఖని అవమానించడంతోనే రామ-రావణ వైరానికి బీజం పడిందంటారు కొందరు. భారతంలో ద్రౌపది తనని చూసి నవ్విందని భ్రమించడం వల్లే, దుర్యోధనుడు ఆమెను నిండు సభలో అవమానించేందుకు ప్రయత్నించాడు. మరీ ఈ స్థాయి అవమానాలు కాకపోయినా, మనకి కూడా అడపాదడపా ఏవో అవమానాలు జరుగుతూనే ఉంటాయి. ఆఫీసులో పై అధికారి నుంచి మాటలు పడటమో, కుటుంబంలో మాటా మాటా అనుకోవడమో ఒక ఎత్తయితే... అనుకోకుండా, అనూహ్యంగా ఎదురయ్యే అవమానాలు మరో ఎత్తు. ఇలాంటప్పుడు ఏం చేయాలో పాలుపోక ఎదురు తిరగడమో, కసితో రగిలిపోవడమో చేస్తుంటాము. మరి ఇలాంటి సందర్భాలను ఎదుర్కొనే మార్గమే లేదా అంటే లేకేం... బోలెడు ఉన్నాయి.

 

ఉద్దేశాన్ని గమనించండి

మీపై మాటల తూటాలను వదిలిన మనిషి మనసులో ఏ ఉద్దేశం ఉందో గ్రహించేందుకు ప్రయత్నించండి. నిజంగానే మీ మీద చులకన భావంతో, మిమ్మల్ని అవమానించేందుకు అతను అలా మాట్లాడుతున్నాడా? సమయం, సందర్భం లేకుండా ఎవరి మీద పడితే వారి మీద విరుచుకుపడటం అతని స్వభావమా? నిజంగానే అతను చెలరేగిపోయేంత తప్పు మీరేమన్నా చేశారా?... ఇలా అతని మాటల వెనుక ఉద్దేశాన్ని గమనించాకే మీ మరుసటి అడుగుకి సిద్ధం కండి.

 

 

నవ్వులాట కింద మార్చేయండి

కోపంతో సాధించలేని కార్యం ఒకోసారి వ్యంగ్యంతో సాధించవచ్చు. అవతలి మనిషి మిమ్మల్ని నలుగురిలోనూ ఒక ఆటవస్తువుగా మార్చాలనుకుని నోరుజారుతుంటే, నవ్వుతూనే అతని వ్యహాన్ని తిప్పికొట్టండి. ఉదాహరణకు ‘మీరు లావుగా ఉన్నారే!’ అని అవతలివారు అంటే... ‘సన్నగా ఉంటే మీ కంటికి ఆనం కదా!’ అని మాటకి మాట బదులివ్వవచ్చు. ఇలా నవ్వుతూనే ఎదుటివారి అస్త్రాలను తిప్పికొట్టే కళని ప్రయత్నించండి.

 

అసంతృప్తిని వెల్లడించండి

అవతలి వ్యక్తి అన్న మాటలకు మీరు బాధపడినట్లు అతనికి తెలియచేయడంలో తప్పులేదు. అది నలుగురిలోనా లేక వ్యక్తిగతంగానా అన్నది సందర్భాన్ని బట్టి ఉండవచ్చు. ‘మీరు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది!’, ‘ఇలాంటి మాటలు మీ స్థాయికి తగినవి కావు!’, ‘మీ మాటలు నన్ను నొప్పించాయి!’... అంటూ నేరుగానే మీ మనసులో కలిగిన బాధని తెలియచేయవచ్చు. మరీ అవసరం అనుకుంటే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయి, మీ నిరసనను తెలియచేయవచ్చు.

 

స్వీకరించవద్దు

కొంతమంది మనల్ని రెచ్చగొట్టి చులకన చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వారి ఉద్దేశాన్ని గ్రహించిన తరువాత, ఇక వారి మాటలకు ప్రతిస్పందించకపోవడమే మేలు! దానివల్ల వారి ప్రయత్నాన్ని గోటితోనే తుంచివేసినట్లు అవుతుంది. మిమ్మల్ని అవమానించాలనుకుని, వారే భంగపాటుకి గురవుతారు. అసలు వారి మాటలను విననట్లు, వారి ఉనికిని గమనించనట్లు ఉంటే... మీ నిరసనని బలంగా తెలియపరిచినట్లు అవుతుంది.

 

అవమానం ఆయుధమైతే!

సాధారణంగా మనలోని బలహీనతలే మనల్ని అవమానించేందుకు కారణం అవుతాయి. శరీర బరువో, నిరుద్యోగమో, వ్యసనాలో... మన మీదకి మాటలు రువ్వేందుకు అవకాశం ఇస్తాయి. అందుకే ఏదన్నా అవమానాన్ని ఎదుర్కొన్న తరువాత, సదరు బలహీనతను దూరం చేసుకునేందుకు కసితో ప్రయత్నించండి. అవమానాన్నే ఆయుధంగా మలచుకోండి. అన్నింటికీ మించి చాలా సందర్భాలలో అవసరానికి మించి చనువుని అందివ్వడం వల్ల, మనల్ని అవమానించేందుకు తగిన అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి మన పరిమితులలో మనం ఉంటున్నప్పుడు, అవతలివారు గీత దాటే సాహసం చేయరు.

 

- నిర్జర.