బంగారం కొనేటప్పుడు మోసపోవద్దు!

 

దనత్రయోదశి వచ్చిందంటే అందరికీ బంగారం మీదే దృష్టి పడుతోంది. శుభసూచకం అనో, సందర్భం వచ్చింది కదా అనో ఎంతోకొంత బంగారాన్ని కొనడం ఆనవాయితీగా మారింది. ఇక ధనత్రయోదశి తరువాత వచ్చే దీపావళి, కార్తీకమాసం, నూతన సంవత్సరం, సంక్రాంతి... ఇలా ఏదో ఒక సందర్భంలో బంగారాన్ని కొనుగోలు చేయడమూ ఎక్కువగానే ఉంది. ఇలాంటప్పుడు కేవలం సెంటిమెంటు మాత్రమే ఉంటే సరిపోదు... బంగారం కొనుగోలు విషయంలో ఎలాంటి మోసానికీ లోను కాకుండా ఉండటమే ముఖ్యం!

 

క్యారెట్ల విషయంలో మోసం

బంగారాన్ని క్యారెట్ల విషయంలో కొలుస్తారన్న విషయం వేరే చెప్పనవసరం లేదు. 24 క్యారెట్‌ బంగారం అంటే 99 పాళ్లు స్వచ్ఛమైన బంగారం అని లెక్క. కానీ ఇంత స్వచ్ఛమైన బంగారంతో చేస్తే ఆభరణాలు త్వరగా విరిగిపోతాయి. అందుకే ఆభరణాలకు దృఢత్వాన్ని ఇచ్చేందుకు, వాటిలో రాగి వంటి లోహాలను కలుపుతారు. ఇలా ఇతర లోహాల కలయికను బట్టి 22, 21, 18 క్యారెట్ల బంగారం అంటూ పేర్కొంటారు.

 

22 క్యారెట్ల బంగారంలో 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మనం తరచూ వినే 916 బంగారం ఇదే! ఇక 18 క్యారెట్ల బంగారంలో కేవలం 75 శాతం మాత్రమే నిజమైన బంగారం ఉంటుంది. చాలా సందర్భాలలో బంగారు దుకాణాలు మనకి 18 క్యారెట్ల బంగారాన్ని అందించి 22 క్యారెట్ల బంగారపు విలువని వసూలు చేస్తాయి. అందుకని ఆ రోజు బంగారం రేటు ఎంత ఉంది అని తెలుసుకుంటే సరిపోదు! ఏ క్యారెట్‌ బంగారానిది ఏ రేటు అని కూడా గమనించాలి. దానికి అనుగుణంగానే ఖరీదు కట్టారో లేదో చూసుకోవాలి.

 

తరుగుదల, మజూరి

ఆభరణం కోసం వాడిన బంగారానికి మాత్రమే కాదు... దానిని రూపొందించేందుకు అయ్యే మజూరి, రూపొందే క్రమంలో పోయిన తరుగుని కూడా బిల్లులో కలుపుతుంటారు. ఈ తరుగు, మజూరీ అనేవి ఆభరణాన్ని బట్టి, దాని రూపుని బట్టి మారిపోతుంటాయి. కాబట్టి ఒక పక్క మనసుకి నచ్చిన ఆభరణాన్ని ఎంచుకొంటూనే, మరోపక్క దానికి అయ్యే తరగు, మజూరీలు వీలైనంత తక్కువగా ఉండేలా సమతూకాన్ని పాటించాలి.

 

తూకం

బంగారం విలువ ఎక్కువ కాబట్టి, ఒకటి రెండు గ్రాములలో తేడా వచ్చినా బిల్లులో భారీ మార్పు తప్పదు. కాబట్టి మిల్లీగ్రాములతో సహా లెక్కకట్టగలిగే తూనికలను వాడాలన్నది ప్రభుత్వ ఆదేశం. అలాంటి తూకాలు ఉన్న దుకాణాలలోనే బంగారం కొనుగోలు చేయడం ఉత్తమం. పైగా ఆభరణపు బరువులోంచి, దానికి అతికించిన రాళ్ల బరువుని తీయించడం చాలామంది మర్చిపోతుంటారు. వీటివల్ల అపారమైన నష్టం తప్పదు. బంగారాన్ని ఎక్కువ మొత్తంలో కొన్నప్పుడు, మొత్తం మీద ఒక పదిగ్రాముల తేడా వచ్చినా ముప్ఫై వేల నష్టం తేలుతుంది. ఇలాంటప్పుడు, మరోచోట ఈ తూకాన్ని సరిచూసుకోవడంలో తప్పులేదు.

 

హాల్‌మార్కు తప్పనిసరి

హాల్‌మార్కు ఉన్న నగలకి ప్రభుత్వమే భరోసా! ఎందుకంటే ప్రభుత్వం తరఫు నుంచి సదరు నగని ఎవరు తయారుచేశారు, ఎప్పుడు తయారుచేశారు, అందులో ఉన్న బంగారం శాతం ఎంత, ఏ హాల్‌మార్కు కేంద్రంలో అది నమోదైంది తదితర వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఇలాంటి నగల విషయంలో మోసం జరిగే అవకాశం తక్కువ.

 

రసీదు తప్పనిసరి

బంగారానికి ఎంత లెక్కకట్టారు, మేకింగ్‌ ఛార్జెస్‌కు ఎంత జోడించారు, ఎంత తరుగు పోయింది... వంటి వివరాలన్నింటితనూ రశీదు తీసుకోవడం తప్పనిసరి. మున్ముందు ఆభరణం విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా ఈ రశీదే మనకు ఉపయోగపడుతుంది.

 

అప్పు చేసి ఆభరణం వద్దు

ఏదో పిల్లల పెళ్లి వంటి అత్యవసరమైన సందర్భాలకు తప్ప అప్పు చేసి మరీ బంగారాన్ని తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. బంగారం రేట్లు ఎప్పటికప్పుడు పెరిగే మాట నిజమే అయినా... మనం చెల్లించే వడ్డీకీ, సదరు పెరుగుదలకీ పొంతన ఉండదు. పైగా బంగారాన్ని లాకర్లలో పెట్టుకొనేందుకు కూడా ఒకోసారి భారీగా అద్దెలు చెల్లించుకోవాలసి ఉంటుంది. అందుకని చేతిలో మిగులు సొమ్ములు ఉంటే తప్ప బంగారాన్ని కొనుగోలు చేసే సాహసం చేయవద్దంటున్నారు.

 

- నిర్జర.