బీజేపీ గండమే కేటీఆర్ పట్టాభిషేకం ఆలస్యానికి కారణమా?

జగన్ ను ఏం చేయబోతున్నారు?
 
తెలుగు రాష్ర్టాలలో బీజేపీ ఏం చేయబోతోంది? ఇది చాలా కాలంగా నలుగుతున్న మిలియన్ డాలర్ ప్రశ్న. ముఖ్యంగా తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు వచ్చినపుడు ఇక్కడ పాగా వేయడానికి నయానో భయానో లేదా ఎన్నికల ద్వారానో ప్రయ్నతిస్తుందని చర్చనడుస్తూనే ఉంది. ఏపీలో మూడు రాజధానులు విషయంలో కమలనాధుల తలాతోకా లేని ప్రకటనలతో ఒక విషయం అర్ధం అవుతోందని అంటున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా ప్రాంతీయ పార్టీల పని పట్టే ఛాన్స్ వచ్చే వరకు వేచి ఉండటమే హైకమాండ్ వ్యూహమట. దానర్ధం అంటే ముఖ్యమంత్రి వీక్ అయినపుడో, లేదా ప్రాంతీయ పార్టీలో ముసలం పుట్టినపుడో తప్ప డైరెక్టుగా జాతీయ స్థాయి నాయకులు అంటే షా లాంటి వారు రంగంలోకి దిగరట. దీనికి ఉదాహరణగా తమిళనాడులో జయలిలిత మరణం తరువాత అన్నాడీఎంకేను పూర్తిగా గుప్పిట్లోకి పెట్టుకున్న వ్యవహారాన్ని ఉదహరిస్తున్నారు. 

 

మధ్య ప్రదేశ్లోను కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ బలంగా లేకపోవడంతో జ్యోతిరాదిత్య సింథియా తరహా అపోజిషన్ శిబిరంలోని నాయకుడిని తమ వైపు తిప్పుకుని మళ్ళీ గద్దెనెక్కారు. నిజానికి మధ్య ప్రదేశ్లో బీజేపీ నాలుగు సార్లు పైగానే వరుస పెట్టి అధికారంలోకి వచ్చింది. శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే సరికి  ప్రజలకు కూడా మొహం మొత్తింది. దానితో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓడిపోయింది. అయితే కాంగ్రెస్ యంగ్ ఫైర్ బ్రాండ్ నాయకుడు జ్యోతిరాదిత్య సహాయంతో ఆ పార్టీని చీల్చి మళ్ళీ చౌహాన్ ను గద్దె మీద కుచోబెట్టారు. కర్నాటకలో అదే తరహా రాజకీయం జరిగింది. కాంగ్రెస్ ను కూలగొట్టారు. ఇక ఎన్ సీపీ ,శివసేన భాగస్వామిగా ఉన్న మహారాష్ర్టలో ఏదో ఒక రోజు మధ్య ప్రదేశ్ లాంటి ఎపిసోడ్ జరగక తప్పదని అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.దీనిని బట్టి అర్ధం అయింది ఏంటంటే ఇపుడు బీజేపికి ప్రధాన్య ప్రత్యర్థి కాంగ్రెస్ కాదు బీజేపీ ఏతర స్టేట్స్ లో ఉన్న ప్రాంతీయ పార్టీలే. అయినా ఇపుడపుడే ఏం చేయకపోవచ్చని వినికిడి. 

 

ఒడిశా, ఎపీ, తెలంగాణ, కేరళ, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థానలో బీజేపీ ప్రభుత్వాలు లేవు. ఆప్ , వైసీసీ, టీఆర్ ఎస్, తృణమూల్ కాంగ్రెస్ లే ఇపుడు కాషాయ పార్టీకి కొరకురాని కొయ్యలు. బీజేపీ కంచుకోట అయిన గుజరాత్ లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచానా ఓట్ల శాతం గణనీయంగా తగ్గింది. వీటన్నిటి కారణంగా బీజేపీ ఇతర స్టేట్స్ మీద ఫోకస్ పెట్టక మానదు. పైగా ఆర్ ఎస్ ఎస్ ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం, అవి తమ సుదూర లక్ష్యమైన అఖండ్ భారత్ ( పాకిస్తాన్, ఇతర సరిహద్దు ప్రాంతాలను కలుపుకున్న పెద్ద దేశం) స్థాపనకు సహకరించవనేది ఆర్ ఎస్ ఎస్ యోచన. అయితే దక్షిణాదిలో బీజేపీ ఎపుడు ప్రాంతీయ పార్టీల తోకపార్టీ గానే ఉంది, తమిళనాడులో కాంగ్రెస్ లా ఆయా శాఖల ప్రెసిండెట్లు ఎవరితో సఖ్యతతో ఉంటే, వారి కులపరమైన ఈక్వేషన్ కారణంగా ఆయా పార్టీలతో వెడుతోంది. ( ఏపీలో ముందు కమ్మలతో టీడీపీతో, ఇపుడు కాపులు జనసేనతో లా). అయితే స్వంతగా పార్టీ జెండా ఎగరేయడానికి ఈ ధోరణి సరపోదని పార్టీ హైకమాండ్ కు తెలిసినా తెలియకపోయినా ముఖ్యమంత్రుల దగ్గర ముసలం వచ్చే వరకు వేచి చూడటం ఖాయమని అంటున్నారు. 

 

ఈ పరమార్ధం గ్రహించిన కేసీఆర్, కేటీఆర్కు నెంబర్ వన్ సీట్ కట్టబెట్టడంలో సమయం తీసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. అటువంటి చర్య హారీష్ రావు రూపంలో పార్టీలో ముసలానికి దారితీయవచ్చని, కమలనాధులు అందుకు ఆజ్యం పోసే అవకాశమూ లేదని టీఆర్ఎస్ పెద్దల అనుమానం. ఇక ఏపీ కి వస్తే ,జగన్ కు పూర్తి మెజార్టీ ఉంది. ఆయన క్రిస్టియన్ మద్దతు పట్ల ఆర్ ఎస్ ఎస్కు రుసరస గానే ఉన్నా ఇప్పటికపుడు ఏం చేయలేకనే ఊరుకుంటున్నారు. బీజేపీ జాతీయ ముఖ్య నాయకుడొకరు కొంత కాలం క్రితం హైదరాబాద్ లో మీడియాతో అంతర్గతంగా మాటాడుతూ, మాకు టీడీపీ, వైసీపీ రెండూ బలహీన పడటం ప్రధానంగా కావాలి అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందాకా మూడు రాజధానులు, అమరావతి , ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్న వివాదాస్పద అంశాల మీద కమలనాధులు కప్పదాట్ల స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పదు. ఆ విషయం తెలిసే జగన్ కూడా కాన్ఫిడెంట్ గా ముందుకు వెడుతున్నారనీ అంటున్నారు. పైగా వైసీపీని బలహీనం చేస్తే కొద్దో గొప్పో తమ మాట వినే జనసేన, టీడీపికి కానీ తమకు కానీ ఆ ఓట్లు వెళ్ళవనే భయం కూడా కమలనాదులలో లేకపోలేదని అందుకే అంతా ప్రస్తుతనికి వెయిట్ అండ్ సీ నే.