ప‌దునైన మోడీ..గాంభీర్య మోడీ!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ..డెబ్బ‌య్ ఏళ్ల వ‌య‌స్సు...ప్ర‌ధానిగా రెండో ట‌ర‌మ్‌లోనూ ప‌ద‌హారు నెల‌లు కావ‌స్తున్న‌ది. క‌రోనా ద‌రిమిలా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ ఆహార్యంలో మార్పు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది. పొడ‌వాటి గ‌డ్డం..మెడ‌చుట్టూ కండువా..అదే మాస్కుగాను ఉప‌యోగం..వీలైనంత‌వ‌ర‌కు మౌన‌మునిలా క‌నిపిస్తున్నారు. ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు, ప్ర‌భుత్వ ప్రొటోకాల్ స‌మావేశాల్లో త‌ప్ప ఇత‌ర‌త్రా ఆయ‌న హ‌డావుడి పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.వినిపించ‌డం లేదు. ఉప‌న్యాసాలు కూడా వీలైనంత‌వ‌ర‌కు క్లుప్తంగా ఉంటున్నాయి. ఎందుకీ మార్పు? ఆయ‌న  అంత‌రంగంలో ఏముంది? ఆయ‌న లోలోన ఏమి ఆలోచిస్తున్నారు?  ఆయ‌నొక‌ హావ‌భావాల సునామీ.. కాని ఈమ‌ధ్య కాలంలో ఎందుకు మౌనాన్ని ఆశ్ర‌యిస్తున్న‌ట్టు? స‌భ‌లు, స‌మావేశాలైనా..అంత‌ర్జాతీయ వేదిక‌లైనా ప్ర‌ధాని మోడీ భావోద్వేగాల‌తో అవి ఊగిపోయేవి. విదేశీ అధిప‌తులు ఆయ‌న ముందు మోక‌రిలిన‌ట్టే అనిపించేది. ఆయ‌న మాట్లాడుతుంటే త‌లూపుతూ వింటూ మంత్ర‌ముగ్దుల్లా అయిపోవాలి త‌ప్ప వారికి వేరే మార్గం ఉండేది కాదు. అగ్ర‌రాజ్యాధిప‌తి ట్రంప్ అయినా అంతే. చేతిలో చెయ్యేసి ట్రంప్ మాట్లాడ‌టం కాదు. మోడీయే ట్రంప్ చేతిమీద చెయ్యేసి జోకేసి మాట్లాడితే ట్రంప్ కూడా న‌వ్వుతూ ఔన‌న్న‌ట్టు త‌లూప‌డ‌మే చూశాం.

గ‌తంలో ఒబామాతోనైనా అవే స‌న్నివేశాలు. స‌రికొత్త‌గా చాయ్‌పే అంటూ ఒక సంద‌ర్భాన్ని క్రియేట్ చేసుకుని ద్వైపాక్షిక సంబంధాల మీద ఒక అవ‌గాహ‌న‌కు రాగ‌లిగిన సమ‌య‌స్ఫూర్తి మోడీ సొంతం.అంతేకాదు.  పార్ల‌మెంటు స‌భాప‌ర్వ‌మైతే ఇక చెప్పేదేముంది? అంతా ఏక‌ప‌క్ష‌మే. మాట‌ల దాడి ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ఎదురుదాడి అంటే ఇంకా ఇష్టం. అల‌వోక‌గా ప‌దాల గార‌డీతో వ్యంగ్య‌బాణాలు సంధిస్తూ అక్ష‌రాల అల మీద సునాయాసంగా ఈత కొడ‌తారు.  ఆయ‌‌న వాగ్దాటి అలాంటిది. ఆయ‌న త‌త్వం అలాంటిది. ఆయ‌న హావ‌భావాల్లో రివ్వున ఎగిరే ప‌క్షుల రెక్క‌ల చ‌ప్పుడు వినిపిస్తుంది. ఆయ‌న శారీర‌క భాష‌లో ఉద్వేగ‌పు దొంత‌ర‌లు తార‌ట్లాడతాయి. అలాంటిది ప్ర‌ధాని మోడీ ఈమ‌ధ్య మిత‌భాషిలా క‌నిపిస్తున్నారు. ఆ చొర‌వ‌లో వేగం కాస్తంత నెమ్మ‌దించిన‌ట్టు అనిపిస్తున్న‌ది. జాతీయ స‌మ‌స్య‌లు, అంత‌ర్జాతీయ అంశాల మీద ఆయ‌న నోటి నుంచి విన‌వస్తున్న మాట‌లు ప‌రిమిత‌మ‌య్యాయి. ప్ర‌ధానిగా తొలి ట‌ర‌మ్ లో మోడీ అంద‌రికీ ఇప్ప‌టికీ గుర్తే. ఆ వేగం..ఆ ప‌దును..ఆయ‌న ప్ర‌తిచ‌ర్య‌లోనూ క‌నిపించేవి. వాటి ప్ర‌తిధ్వ‌నులు వినిపించేవి. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు చారిత్రాత్మ‌కం. సాహ‌సోపేతం. ఆ నిర్ణ‌యాల్లో ప‌దును మ‌న‌సుల‌కు తాకేది.

కాలం చెల్లిన‌, తుప్పుప‌ట్టిన కొన్ని వ్య‌వ‌స్ధ‌ల‌కు ఆయ‌న మంగ‌ళం పాడిన‌ప్పుడు యావ‌జ్జాతి స‌మ్మ‌తించింది. ఆ ఆలోచ‌ల్లోని తెగువ చూసి ముచ్చ‌ట‌ప‌డింది. ప్లానింగ్ క‌మిష‌న్ని బుట్ట‌దాఖ‌లా చేయ‌డం..2016 న‌వంబ‌రులో పెద్ద‌నోట్ల రద్దు..2017 జులైలో జీఎస్టీ..2016 సెప్టెంబ‌రులో పాకిస్తాన్ మీద స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్సు..ఇలా మొద‌టి ట‌ర‌మ్ అంతా సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో సాగింది. అంతేకాదు. ఆయ‌న జ‌రిపిన ప్ర‌తి విదేశీ ప‌ర్య‌ట‌న ఒక ప‌ర్వ‌దినంగా వెలిగింది. స్ధానిక భార‌తీయుల స‌మ్మేళ‌నాలు జ‌రిగాయి. ఆ బ‌హిరంగ వేదిక‌ల మీద ఆయా దేశాల అధిప‌తుల‌తో క‌లిసి మోడీ చేసిన ప్ర‌సంగ విన్యాసాలు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌ను ఆక‌ర్షించాయి.

ఇక రెండో ట‌ర‌మ్‌..అదొక సాహ‌స క్రీడ‌. ఆర్టిక‌ల్‌370 ర‌ద్దు..రామాల‌య నిర్మాణం..త్రిపుల్ త‌లాక్‌..సిటిజెన్ షిప్ యాక్టు..ఇర‌వై ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీ..ఇలా ఒక్కొక్క‌టీ ఒక్కో చారిత్రాత్మ‌క నిర్ణ‌యం. ఇవ‌న్నీ మోడీ సాహ‌సోపేత నాయ‌క‌త్వానికి చిహ్నాలుగా శాశ్వతంగా చ‌రిత్ర‌లో నిలిచిపోతాయి. ఇక ఈ ఏడాది మార్చి నుంచి ఒక దుర్ద‌శ మొద‌లైంది. అదే క‌రోనా కాలం. క‌‌రోనా మ‌హ‌మ్మారి మ‌న‌దేశంలోకి ప్ర‌వేశించిన తొలినాళ్ల‌లో ప్ర‌ధాని మోడీ కార్యోన్ముఖుల‌య్యారు. దేశ ప్ర‌జ‌ల‌కు త‌క్ష‌ణ క‌ర్త‌వ్యాన్ని బోధించ‌డంలో వినూత్న ప‌ద్ద‌తుల‌తో ముందుకొచ్చారు. లాక్‌డౌన్ కాలంలో దేశ‌ప్ర‌జ‌లంద‌రిచేతా కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల‌ను మ‌న‌సా వాచా అమ‌లుచేయించ‌డంలో విజ‌యం సాధించారు. లాక్‌డౌన్ వ‌ల్ల దేశం ఎదుర్కొన్న ఆర్ధిక సంక్షోభం నుంచి కోలుకునే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. 2014లో ప్ర‌ధాని మోడీ తొలిసారి ప్ర‌ధానిగా ప‌ద‌వీబాధ్య‌త‌లు స్వీక‌రించాక అయిదేళ్ల‌పాటు వ్య‌వ‌హ‌రించిన తీరు ఒక ర‌కం. రెండోద‌ఫా ప్ర‌ధాని అయ్యాక వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మ‌రొక ర‌కం. మొద‌టి ట‌ర‌మ్ లో వినూత్న‌పంథాలో అడుగులేశార‌న్న భావ‌న అంద‌రిలో ఉంది. రెండో ట‌రమ్‌లో ఆయ‌న‌లో మ‌రింత ప‌రిప‌క్వ‌త కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది. అది ఆయ‌న ఆహార్యంలో ప్ర‌తిబింబిస్తున్న‌ది. పొడ‌వాటి గ‌డ్డం అంద‌రూ గుర్తించేలా ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్న‌ది. ఆయ‌న‌లో మునిపుంగ‌వుడు ద‌ర్శ‌న‌మిస్తున్నాడ‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఆరేళ్ల భార‌త‌దేశ సార్వ‌భౌమ‌త్వ బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ అనంత‌రం ఆయ‌న‌లో ఈ మార్పు దేశ ప్ర‌గ‌తికి ఒక చిహ్న‌మ‌న్న భావ‌న క‌లుగుతున్న‌ది. పాకిస్తాన్ తో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరుకు, చైనాతో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకు పొంత‌న లేద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది.

అయితే ఆ రెండు దేశాల‌తో మ‌న‌కున్న వివాదాల గుణ‌గ‌ణాలు వేరు. రెండింటినీ పోల్చి చూడ‌డం భావ్యం కాదు. కాని పాకిస్తాన్ విష‌యంలో మెరుపుదాడుల‌తో ఆయ‌న తీవ్రంగా వేగంగా స్పందించిన విష‌యాన్ని విశ్లేష‌కులు ఇక్క‌డ గుర్తు చేస్తున్నారు. అదే చైనా ద‌గ్గ‌ర‌కొచ్చేస‌రికి ఆయ‌న‌లో నిగ్ర‌హం క‌నిపిస్తున్న‌ది. చైనా సైనికులు ల‌డ‌ఖ్ లోని పాంగాంగ్లో మ‌న జ‌వాన్ల‌ని వ‌ధించినందుకు మొద‌టి ట‌ర‌మ్ మోడీ అయితే ఏమి చేసి ఉండేవార‌న్న విశ్లేష‌ణ‌లు జ‌ర‌గ‌క‌పోలేదు. అయితే   చైనాతో వ్య‌వ‌హ‌రిస్తున్న‌తీరు విదేశాంగ విధానంలో ఆచితూచి అడుగులేయాల‌న్న ప్రాథ‌మిక సూత్రానికి అనుగుణంగా ఉంది. శ‌త్రుశిబిరం దుందుడుకుగా వ్య‌వ‌హ‌రిస్తున్నా..భార‌త్ మాత్రం చ‌ర్చ‌ల‌కే ప్రాధాన్య‌మిస్తున్న‌ది. చైనాతో ద‌శాబ్దాల మైత్రి ఒక వంక మోడీని క‌ట్టిప‌డేస్తున్న‌ది. భార‌తీయ సంప్ర‌దాయ‌క మైత్రీభావ‌న‌ను చెక్కుచెద‌ర‌నీయ‌కూడ‌ద‌న్న మోడీ భావ‌న ఆయ‌న‌లోని ప‌రిప‌క్వ‌త‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్న‌ది. ఈ ప‌రిప‌క్వ‌త‌కు అనుగుణంగానే క్ర‌మ‌బ‌ద్దంగా ఆయ‌న ఆహార్యంలో మార్పు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది!