హౌడీ మోదీ కార్యక్రమం దానికోసమేనా...?

 

అమెరికా లోని హ్యూస్టన్ నగరంలో ఆదివారం నిర్వహించే హౌడీ మోదీ పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. దాదాపు యాభై వేల పై చిలుకు ప్రవాస భారతీయులు అమెరికన్ చట్ట సభల సభ్యులు హాజరయ్యే ఈ సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు పాల్గొంటున్నారు. వాషింగ్టన్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి నగరాలను కాదనుకుని టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరాన్ని ఆయన ఎందుకు ఎంచుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సభకు ఎందుకు హాజరవుతున్నారు అన్నవి అందరిలో ఉత్కంఠ పెంచుతున్నాయి. అమెరికాతో ఇంధన భగ్నమే లక్ష్యంగా మోదీ తన సభ కోసం హ్యూస్టన్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి భారత్ లో చమురుకు విపరీతమైన డిమాండ్ ఉంది.

ఇరాన్ పై అమెరికా ఆంక్షల తర్వాత అక్కడి నుంచి భారత్ కు చమురు ఎగుమతులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో చమురు కోసం మరో దేశంపై భారత్ ఆధారపడాల్సిన పరిస్థితి. అందుకే అమెరికా వైపు భారత్ చూస్తోంది. అమెరికా చమురు వ్యాపారులకు భారత్ అవకాశాల మార్కెట్ లాగా కనిపిస్తుంది. తమ మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను చైనా ఆపేసింది. దీంతో అమెరికా చమురు వ్యాపారులు భారత్ వైపు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే భారత్ అమెరికా ఇంధన భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కొనుగోళ్లను ముమ్మరం చేయడం ఈ ఒప్పందంలో భాగమే. అమెరికాలో అత్యధికంగా చమురును ఉత్పత్తి చేసే ఎనిమిది రాష్ట్రాల్లో ఒకటైన టెక్సాస్ లోని హ్యూస్టన్ ని మోదీ సభకు ఎంచుకోవడం ఈ వ్యూహంలో భాగమేనన్నది విశ్లేషకుల మాట.
ప్రపంచ చమురు రాజధానుల్లో ఒకటిగా పేరున్న హ్యూస్టన్ లో దాదాపు పదహారు చమురు కంపెనీల సీఈవోలతో మోదీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. ఎక్సినో మోబిల్ బిపి షల్ లాంటి ప్రఖ్యాత చమురు కంపెనీల ప్రతి నిధులు ఇందులో పాల్గొంటున్నారు. చమురు సహజవాయు రంగాల్లో భారత్ ప్రధాన మార్కెట్ అని వారికి ప్రధాని నొక్కి చెప్పనున్నారు. సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడుల తర్వాత చమురు సంక్షోభం ముంగిట నిలిచిన భారత్ కు ఇప్పుడు అమెరికా అవసరం ఎంతైనా ఏర్పడింది. భారత్ గత ఏడాది అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చమురు గ్యాస్ విలువ దాదాపు నాలుగు వందల కోట్ల డాలర్లు. దీనిని ఈ ఏడాది మరింతగా పెంచాలన్నది లక్ష్యం. అమెరికా నుంచి ఎల్ఎన్జీని భారత గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా గెయిల్ కొనుగోలు చేస్తోంది.

ఇది అమెరికా ఎగుమతుల్లో దాదాపు 4.7 శాతం భారత్ లోనే పెట్రోనెట్ ఎల్.ఎన్.జి లిమిటెడ్ కు వాటా విక్రయం కోసం అమెరికాలోని టెల్లూరియం ఐఎన్సీ గత ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకుంది. కేవలం చమురు గ్యాస్ మాత్రమే కాకుండా అంతకు మించిన బంధాన్ని ఆశించే మోదీ హ్యూస్టన్ వెళుతున్నారు. ఈ నగరంతో భారత్ కు అవినాభావ సంబంధం ఉంది. హ్యూస్టన్ కేంద్రంగా పని చేస్తున్న దాదాపు ఇరవై ఎనిమిది కంపెనీలు భారత్ లో అరవై తొమ్మిది అనుబంధ కంపెనీలను నిర్వహిస్తున్నాయి. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో హ్యూస్టన్ నాలుగో అతిపెద్ద గేట్ వే.

ఇది భారత్ కు పదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి నగరం. ఈ వ్యాపారం విలువ దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల డాలర్లు. రెండు దేశాల మధ్య ఆర్ధిక బంధంలో ఈ నగరం పాత్ర క్రియాశీలం. మరి కొన్ని కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించడం మోదీ హ్యూస్టన్ పర్యటన ఉద్దేశం. ఈ నగరంలో నివసిస్తున్న లక్షలాది మంది భారత సంతతికి చెందిన వారు అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. మాతృదేశానికి సేవలందించేలా వీరిని కార్యోన్ముఖుల్ని చేయటం మోదీ పర్యటన లక్ష్యం. మరో పక్క రెండు వేల ఇరవైలో తిరిగి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్ కు హ్యూస్టన్ లోని భారత సంతతి అమెరికన్ల మద్దతు చాలా అవసరం.

సహజంగానే డెమోక్రాట్ లకు మద్దతు పలికే భారతీయుల్ని ఈ మారు ఎలాగైనా రిపబ్లికన్ పార్టీ వైపు తిప్పుకోవడం ట్రంప్ పర్యటన లక్ష్యం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలని బలంగా కోరుకుంటున్న అమెరికా తాజాగా జపాన్, భారత్, ఆస్ట్రేలియాలతో కలిసి చతుర్ముఖ యంత్రాంగం ఏర్పాటు చేయాలని బలంగా కోరుకుంటోంది. ఈ ప్రయత్నాలకు ఊపునివ్వడం ట్రంప్ హాజరు వెనుక ఉద్దేశం. భారత్ లో వ్యవసాయం పాడి తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అమెరికా ప్రైవేటు బహుళజాతి కంపెనీలు కోరుకుంటున్నాయి. ఈ వ్యాపార బంధాన్ని పటిష్టం చేయాలని ట్రంప్ అభిలషిస్తున్నారు.