సమగ్ర సర్వేపై విచారణ పన్నెండున్నరకి వాయిదా...

 

మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో విచారణ ప్రారంభమైంది. కృష్ణయ్య అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో ఈ విచారణ జరుగుతోంది. ఈ విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ హాజరయ్యారు. సమగ్ర సర్వే నిర్బంధం కాదని, ఇది ఐచ్ఛిక సర్వే అని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు ఇప్పటికే విన్నవించిన విషయం తెలిసిందే. కాగా, ఈ విచారణ మధ్యాహ్నం పన్నెండున్నరకి వాయిదా పడింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎలాంటి జీవో లేకుండా విచారణ జరపడం చట్ట విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఆర్టికల్ 162 ప్రకారం ప్రభుత్వ సర్కులర్ చెల్లుబాటు కాదని న్యాయమూర్తికి విన్నవించారు. పంచాయితీరాజ్ విభాగం నుంచి కేవలం సర్కులర్ మాత్రమే జారీ చేశారని పేర్కొన్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత న్యాయమూర్తి ఎలా స్పందిస్తారో చూడాల్సి వుంది.