TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ కు సహకరించిన మంత్రులపై సిబిఐ కన్ను

Published on: Sat May 19, 2012 10:13AM

వైఎస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ మంత్రుల ప్రమేయంపైనా ఆరా తీస్తోంది. ప్రభుత్వం తరఫున జీవోలు జారీకి ఉన్నతస్థాయి అధికారులు ఎంతైతే బాధ్యులో, సంబంధిత మంత్రులు సైతం అంతే బాధ్యులని భావించిన సిబిఐ ముఖ్యంగా ఇద్దరు మంత్రులపై దృష్టి పెట్టింది. ప్రస్తుత హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణలను మరోసారి సిబిఐ స్కానింగ్ చేస్తోంది. గతంలో వీరిద్దరిని ఒకసారి విచారించారు. మళ్లీ ఇప్పుడు విచారిస్తున్నారు. పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ కంపెనీలకు సున్నపురాయి క్వారీ భూముల కేటాయింపుపై అప్పట్లో గనుల శాఖ మంత్రిగా పనిచేసిన పి.సబితా ఇంద్రారెడ్డిని సీబీఐ బృందం గురువారం సాయంత్రం విచారించింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసు దర్యాప్తులో భాగంగా సబితను ఆమె నివాసంలోనే గంటన్నరపాటు అధికారులు విచారించారు. సిమెంట్ కంపెనీలకు భూ కేటాయింపులకు సంబంధించి ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు జరిగాయా? అనే కోణంలో ఆరా తీశారు. సిమెంట్ కంపెనీలకు క్వారీ భూముల కేటాయింపులపై సీబీఐ కొన్ని అనుమానాలను తన దృష్టికి తీసుకువచ్చిందని, వాటిని నివృత్తి చేశానని సబితారెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. దర్యాప్తు బృందం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానన్నారు. భూ కేటాయింపులకు సంబంధించి తనపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవని వారికి స్పష్టం చేసినట్లు చెప్పారు.