మాజీ హోం చిదంబరం పై ప్రతీకారం తీర్చుకున్న హోం మంత్రి అమిత్ షా!!

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అంటున్నారు. 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలో విదేశీ పెట్టుబడులకు చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా అనుమతిచ్చారని సీబీఐ, ఈడీ చెబుతున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆయన ముడుపులు అందుకున్నారని కేసులు నమోదు చేశాయి. ఈ కేసుల్లో చిదంబరం దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వెంటనే సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఆయన సుప్రీంను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం స్పందించింది. అరెస్ట్ చేయకుండా ఉండాలని ఇప్పటికిప్పుడు ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ స్పష్టం చేశారు. ఈ కేసును చీఫ్ జస్టిస్ (సీజేఐ) రంజన్ గొగోయ్‌కు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. అత్యవసర విచారణ జరపాలా.. వద్దా అనే విషయంపై సీజేఐ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు, చిదంబరం ఆచూకీ ఇంతవరకూ తెలియకపోవడంతో సీబీఐ అధికారులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

చిదంబరం అరెస్ట్ వార్తల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దీని వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో కేంద్రంలో యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర హోంమంత్రిగా చిదంబరం ఉన్నారు. ఆ సమయంలో గుజరాత్‌ హోంమంత్రిగా ఉన్న అమిత్‌ షాను అరెస్ట్‌ చేయించి.. జైల్లో వేయించారు. సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌లో అమిత్‌ షా హస్తముందని ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2005 నవంబర్ 22వ తేదీన గుజరాత్ పోలీసులు సోహ్రాబుద్దీన్ ను, ఆయన భార్య కౌసర్ బీని, మరో వ్యక్తిని పట్టుకుని కాల్చి చంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో అమిత్‌ షా 3 నెలల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఆ తరువాత ఆయనకు గుజరాత్‌ హైకోర్టులో బెయిలు మంజూరు కావడంతో బయటకు వచ్చారు.

కట్ చేస్తే ఇప్పుడు సీన్ టోటల్ రివర్స్ అయింది. అమిత్‌ షా ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉంటూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు. అప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన చిదంబరం నేడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తనను జైలుకు పంపిన చిదంబరంను ఎలాగైన కేసుల్లో ఇరికించి జైలుకు పంపాలని అమిత్‌ షా ప్రతీకార చర్యకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి.