భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ కన్నుమూత

ప్ర‌ముఖ‌ హాకీ క్రీడాకారుడు, పద్మశ్రీ బల్బీర్ సింగ్ సీనియర్ (95) క‌న్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ మొహాలీలోని ఫార్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 

ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడుసార్లు బంగారు పతకాలు అందించడంలో బల్బీర్ సింగ్ కీలక పాత్ర పోషించారు. హాకీ ఒలింపిక్స్ లండన్ (1948), హెల్సింకి (1952), మెల్‌బోర్న్‌ (1956) లలో భారత్ బంగారు పతకాల‌ను సాధించింది. ఈ మూడు బంగారు పతకాల విజయంలో బల్బీర్ సింగ్ కీలక పాత్ర పోషించారు. 

బల్బీర్ సింగ్ గోల్ మెషీన్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపుపొందారు. 1952లో జరిగిన ఒలింపిక్స్ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత గోల్స్ సాధించిన ఘనతను బల్బీర్ సింగ్ సొంతం చేసుకున్నారు. ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించిన 16 మంది దిగ్గజ హాకీ ఆటగాళ్లలో బల్బీర్ సింగ్ కూడా ఉన్నారు. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క భారత ఆటగాడిగా బల్బీర్ సింగ్ రికార్డులకెక్కారు. 1957లో భారత ప్రభుత్వం బల్బీర్ సింగ్ ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.