హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్‌కు రూ.50 కోట్ల అక్రమాస్తులు..!
Published on: Tue Jul 14, 2026 6:35PM

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ నివాసం సహా ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు చెందిన ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈరోజు ఉదయం నుంచే విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. రవీందర్‌పై పలు ఆరోపణలు రావడంతో డిఏ కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ మాట్లాడుతూ.. హైదరాబాద్, నిజామాబాద్‌తో పాటు మొత్తం 10కిపైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో రవీందర్‌కు చెందినట్లు గుర్తించిన ఆస్తుల విలువ రూ.50 కోట్లకు పైగా ఉన్నట్లు తెలిపారు. సోదాల్లో సుమధుర ఆక్రోపోలిస్‌లో ఒక త్రీ-బెడ్‌రూమ్ ఫ్లాట్, శ్రీవారి మెడోస్‌లో ఒక ఫ్లాట్, వాసవి అట్లాంటిస్‌లో మూడు ఫ్లాట్లు, శంషాబాద్– షాబాద్ ప్రాంతంలో నాలుగు ఎకరాల భూమి, మసీద్‌బండలో 300 గజాల స్థలంలో నాలుగు అంతస్తుల భవనం, జడ్చర్లలో ఏడు ఫ్లాట్లు, కొండాపూర్‌లో రెండు ఫ్లాట్లను గుర్తించినట్లు వెల్లడించారు.
అదేవిధంగా సుమారు కిలో బంగారు ఆభరణాలు, కిలోకు పైగా వెండి ఆభరణాలు, సుమారు రూ.10 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, నాలుగు బ్యాంక్ లాకర్లు, ఇంట్లో రూ.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 18 విదేశీ మద్యం బాటిళ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఇంకా పలుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయని, రవీందర్‌కు చెందిన ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ వెల్లడించారు.
HMDA Chief Engineer Ravinder, ACB, ACB DSP Majid Ali Khan, CM Revanth reddy, ACB Raids,Nanakramguda


