గాడ్సే విగ్రహాలు ఏర్పాటు చేయాలి

 

గాంధీజీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సే విగ్రహాలను దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రతిష్టించాలని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు చంద్ర ప్రకాశ్ కౌశిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎంతోమంది హిందువులను చంపిన ఔరంగజేబు పేరు మన దేశంలో రోడ్లకు పెట్టారని, అలాంటప్పుడు దేశానికి అన్యాయం చేస్తున్నారన్న బాధతో గాంధీజీని చంపిన నాథూరామ్ గాడ్సే విగ్రహాలు దేశంలో ఎందుకు వుండకూడదని చంద్ర ప్రకాశ్ కౌశిక్ ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన డిమాండ్‌కి స్పందించి దేశవ్యాప్తంగా గాడ్సే విగ్రహాలను ఏర్పాటు చేయాలని, లేకపోతే తామే అన్ని రాష్ట్రాల్లోని హిందూ మహాసభ కార్యాలయాల్లో గాడ్సే విగ్రహాలను ప్రతిష్టిస్తామని ఆయన అన్నారు. నాధూరాం గాడ్సే పాలరాయి ప్రతిమ సెంట్రల్ ఢిల్లీలోని మందిర్ మార్గ్‌లో ఉన్న తన ఆఫీసులో ఒక మూల ఉందని చెప్పారు. ఈ పాలరాతి గాడ్సే ప్రతిమను రాజస్థాన్‌లోని కిషన్‌గడ్‌లో 17 వేల రూపాయల ఖర్చుతో తయారు చేయించానని చెప్పారు. దేశ స్వతంత్రం కోసం పోరాటంలో స్వల్ప పాత్ర పోషించిన గాంధీ మాదిరిగా కాకుండా, భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన దేశభక్తుడు గాడ్సే అని కౌశిక్ అభివర్ణించారు.