అక్రమ నిర్మాణాలు కూల్చమన్నందుకు మహిళా అధికారి కాల్చివేత...

 

అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్నందుకు ఓ మహిళా అధికారిణిని కాల్చి చంపేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణమైన ఘటన హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం సోలాన్ జిల్లాలోని కసౌలీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందిగా సుప్రీంకోర్టు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్ అధికారులు కసౌలీ పట్టణానికి చేరుకుని.. పోలీసుల సాయంతో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అధికారులు మండో మాట్కండలో ఉన్న నారాయణి గెస్ట్ హౌజ్ వద్దకు చేరుకున్నారు. అయితే ఆ గెస్ట్ హౌజ్ కు నాలుగు అంతస్తుల మేరకు మాత్రమే అనుమతి ఉంది. కానీ గెస్ట్ హౌజ్ యజమాని విజయ్ సింగ్ మాత్రం ఆరు అంతస్తులు కట్టాడు. దీంతో  భవనాన్ని కూల్చివేయాల్సిందిగా అసిస్టెంట్ టౌన్ ప్లానర్ షేల్ బాలా ఆదేశించారు. దీంతో విజయ్ సింగ్ కు షేల్ బాలా కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో ఆగ్రహానికి గురైన విజయ్ సింగ్ తుపాకీతో పీడబ్ల్యూడీ అధికారులపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో షేలా బాలా అక్కడికక్కడే మృతి చెందగా, మరో అధికారి గులాబ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన అనంతరం విజయ్ సింగ్ సమీపంలోని అడవిలోకి పారిపోయాడు. పోలీసులు అతని కొరకు దర్వాప్తు ముమ్మరం చేశారు. విజయ్ సింగ్ ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష రివార్డు అందిస్తామని పోలీసులు తెలిపారు.

 


కాగా, మహిళ అధికారిణి హత్య ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా తీసుకుంటున్నట్లు కోర్టు ప్రకటించింది. కేసుపై గురువారం వాదనలు విననున్నట్లు ప్రకటించింది.