హిమ దాస్ … సవాళ్ల మీద పరుగు తీసిన సంచలనం! 

అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవ్వరూ గుర్తించరు! అద్భుతం జరిగాక ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు! భారత్ కు అధ్లెటిక్స్ లో తొలి స్వర్ణం సాధించి పెట్టిన హిమ దాస్ … అలాంటి ఓ అద్భుతం! ఆమె తమ వరి పొలాల్లో తెల్లెవారుఝామున చెప్పులు సైతం లేని అరికాళ్లతో పరుగులు పెడుతుంటే… దేశంలో ఎవ్వరూ ఆమెని గుర్తించలేదు. ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ పొటీల్లో స్వర్ణం సాధించింది. మనతో సహా అందరం తెగ మాట్లాడుకుంటున్నాం! కానీ, అవేవీ ఆమెకు పెద్దగా ఉపయోగపడేవి కావు. స్వంతంగా ధగధగ మెరిసే తారజువ్వలా ఆకాశానికి ఇప్పటికే ఎగిసిపోయింది!

 

 

హిమ దాస్ ఈ మద్య కాలంలో భారతదేశం నుంచి తళుక్కున మెరుస్తోన్న క్రీడాకారిణుల్లో ఒకరు! అంతే అయితే ఇంతగా మాట్లాడుకోవటం అనవసరం. సంవత్సరంలో జరిగే అనేక క్రికెట్ టోర్నమెంట్లలో అడపాదడపా కొత్త క్రికెటర్లు వస్తూనే వుంటారు. అభిమానుల్ని తమ విన్యాసాలతో కట్టిపడేస్తుంటారు. అలాగే, సానియా, సైనా, సింధూ ఇలా బోలెడు మంది ఇతర క్రీడల్లోని ఛాంపియన్స్ కూడా మనల్ని మెస్మరైజ్ చేస్తుంటారు. కానీ, హిమ దాస్ విజయం కేవలం క్రీడలకు సంబంధించిన అద్భుతం కాదు. అదీ ఇక్కడి ప్రత్యేకత! కేవలం పట్టుదలనే తన కాలికి బూట్లుగా తగిలించుకుని దీక్ష అనే ట్రాక్ పై రన్నింగ్ చేసింది హిమ! అందుకే, ఆమె జీవితంలో ఏ రంగంలో ప్రయత్నం చేస్తోన్న వారికైనా అద్భుతమైన ప్రేరణ! ఆమె ఆటల్లో విజయం సాధించి వుండవచ్చు. కానీ, హిమ దాస్ విజయం మాత్రం ఓ ఆట కాదు!

 

 

హిమ దాస్ ఏ ముంబై, దిల్లీ లాంటి సకల సౌకర్యాలున్న మహానగరంలోనో పుట్టలేదు. ఈశాన్య భారతదేశంలో మారుమూలన వున్న ఆసోంలో పుట్టింది. ఆమె ఊరు థింగ్. తండ్రి వరి పండించే రైతు. పొలంలో పండేది అన్నమే అయినా వారికి కడుపునిండా ఆహారం వుండేది కాదు. అలాంటి రైతులు మనకు కొత్తేం వుంది? ఏ రాష్ట్రంలో చూసినా రైతులు ఎలా ఇబ్బందులు పడుతుంటారో అలాంటి ఓ సగటు భారతీయ రైతే హిమ దాస్ తండ్రి. కానీ, ఆయన కూతురు మాత్రం సగటు భారతీయ అమ్మాయి కాదు. సగటు భారతీయ అమ్మాయిలో పట్టుదల భగ్గుమంటే ఎలా వెలిగిపోతుందో కళ్లారా చూపించిన వెలుగు దివ్వె! మొదట ఫుట్ బాల్ బాగా ఆడిన హిమ తండ్రితో పాటూ పొలంలో నేల దున్నేది, విత్తనాలు వేసేది, ట్రాక్టర్ నడిపేది. కానీ, ఫుట్ బాల్ ఆడుతున్నప్పుడు బంతి వెంట సుడిగాలిలా దూసుకుపోతోన్న ఆమె వేగాన్ని ఓ ఉపాధ్యాయుడు గమనించాడు. అథ్లెటిక్స్ కి మారి పరుగు పందంపై దృష్టి పెట్టమన్నాడు! అదే హిమ దాస్ ని రైట్ ట్రాక్ పైకి తీసుకొచ్చింది.

 

 

 

తమ స్వగ్రామం నుంచీ అసోం రాజధాని గువాహటీకి చేరుకుని ఓ దాత ఇచ్చే డబ్బులతో రన్నింగ్ ప్రాక్టీస్ చేసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విజయాలు నమోదు చేసింది. హిమ దాస్ ని ఇంటి నుంచి గువాహటీకి పంపేటప్పుడు ఆమె తండ్రి అంతర్జాతీయ స్వర్ణాలు ఆశించలేదు. నలుగురు సంతానంలో ఆమె అన్నా ఇంటికి దూరంగా వుంటూ మూడు పుటలా సరిగ్గా అన్నం తింటుందని భావించాడు! అలాంటి పేదరికం వారిది! అయినా, భూమిపై కదిలే మానవ రాకెట్ లా దూసుకుపోయే హిమని దారిద్ర్యం అడ్డుకోలేకపోయింది. పైగా అదే ఇంధనంలా మారి ముందుకు తోసింది. ప్రపంచ అథ్లెటిక్స్ లో మన దేశం మొత్తాన్ని గర్వంగా తల ఎత్తుకునేలా చేసింది!

 

 

ఒక సానియా, ఒక సైనా, ఒక సింధూ విజయాలు సాధించనప్పుడు ఎలాంటి హంగామా చేశారో ఇప్పుడూ అదే చేస్తున్నారు పొలిటీషన్స్. మీడియా కూడా హిమ దాస్ అంటూ జపం చేస్తోంది. కానీ, అసలు గుర్తించాల్సింది హిమ దాస్ ని కాదు! ఆమె ఎదుర్కొంటూ వచ్చిన సవాళ్లని! ఈ దేశంలో అడుగడుగునా హిమ దాస్ లే! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్త శుద్ధి వుండాలే కానీ ఎక్కడ పిడికెడు మట్టి తీసినా… మాణిక్యాలే బయటపడతాయి. అంత జనాభ, అంత శక్తి, సామర్థ్యాలు, అంతటి అవకాశాలు వున్నాయి. అయినా ఒలంపిక్స్ వచ్చిన ప్రతీసారి ఒకటి , అరా మెడల్స్ కోసం మొఖం వాచిపోయేలా ఎదురు చూస్తూ వుంటాం. కారణం … హిమ దాస్ లాంటి వార్ని పట్టించుకోకపోవటమే. డబ్బున్న సంపన్నలు, ఎంతో కొంత ఖర్చు చేయగలిగే మధ్య తరగతి వారు డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏలు అయిపోయి మరింత డబ్బు సంపాదిస్తున్నారు. మిగతా అన్ని రంగాల్లో దేశాన్ని సగర్వంగా నిలపగలిగే వారు ఊళ్లలో, నగరాల్లోని మురికి వాడల్లో మగ్గిపోతున్నారు. వారంతా హిమ దాస్ లాంటి తారజువ్వలే! కావాల్సింది వారికి సౌకర్యం, అవకాశం అనే అగ్గిని అందించటమే! ఒక్కసారి గ్రామ గ్రామంలోని హిమ దాస్ లాంటి లెక్కలేనంత మందికి ప్రభుత్వాలు ప్రొత్సాహమనే నిప్పుని తాకిస్తే ఆకాశాన్ని అంటుకుంటారు!

ఓ అంతర్జాతీయ విజయం సాధించి వచ్చిన వారికి కోట్లు గుమ్మరించటం కాకుండా కోట్ల మంది అంతర్జాతీయ విజయాలు సాధించేలా ఏం చేయాలో ఇప్పటికైనా పాలకులు ఆలోచించాలి!