బెంజ్ సర్కిల్లో బాబు భగభగలు... మళ్లీ అక్కడ్నుంచే బస్సు యాత్ర...

రాజధానిపై ఆందోళనలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. మూడు రాజధానులను ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విజయవాడ నుంచి అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన బస్సు యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బెంజ్ సర్కిల్‌లో జేఏసీ కార్యాలయాన్ని ప్రారంభించి పాదయాత్రగా వెళ్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర గంటల తరబడి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

బెజవాడ బెంజ్ సర్కిల్లో చంద్రబాబు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబు, సీపీఐ రామకృష్ణ, జేఏసీ నేతలు బైఠాయించారు. దాంతో, గంటల తరబడి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో పెద్దఎత్తున తరలివచ్చిన టీడీపీ శ్రేణులు... బాబుకి మద్దతుగా ఆందోళనకు దిగారు. సీఎం జగన్‌కు, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అయితే, టీడీపీ కార్యకర్తల్లో ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

శాంతియుతంగా తాము నిరసనలు తెలుపుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను చంద్రబాబు ప్రశ్నించారు. చట్టప్రకారం పర్మిషన్ తీసుకుని తాము బస్సు యాత్ర చేస్తుంటే... ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. అయితే, బస్సు యాత్రను అనుమతి లేదంటూ పోలీసులు తేల్చిచెప్పారు. అయినప్పటికీ, ఆందోళన విరమించకపోవడంతోపాటు చంద్రబాబుతోపాటు టీడీపీ, జేఏసీ నేతలను అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడిచిపెట్టారు.

చంద్రబాబును పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడంపై తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నాయి. అర్ధరాత్రి బాబు నివాసానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. బాబును అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ  రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. జాతీయ రహదారులపై టైర్లకు నిప్పు పెట్టారు.

అయితే, బెజవాడ బెంజ్ సర్కిల్ లో ఇవాళ మళ్లీ ఆందోళనకు దిగాలని చంద్రబాబు నిర్ణయించారు. ఎక్కడైతే తనను అదుపులోకి తీసుకున్నారో అక్కడ్నుంచే బస్సు యాత్రను ప్రారంభించాలని భావిస్తున్నారు. అనంతరం మచిలీపట్నంలో అమరావతి పరిరక్షణ సమితి నిర్వహిస్తోన్న బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు.