TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్.. బాల్క సుమన్ అరెస్టుకు పోలీసుల యత్నం

Published on: Sat May 30, 2026 1:09PM

 

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై నమోదైన కేసు నేపథ్యంలో ఆయనను విచారణ కోసం తీసుకెళ్లేందుకు పోలీసులు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల చర్యలను అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

టాస్క్‌ఫోర్స్, నాంపల్లి పోలీసులు తెలంగాణ భవన్‌కు చేరుకుని బాల్క సుమన్‌ను విచారణ నిమిత్తం తమ వెంట రావాలని కోరారు. అయితే పోలీసులు భవన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "పోలీసులు గో బ్యాక్", "ప్రభుత్వం కక్షసాధింపు ఆపాలి" అంటూ నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తెలంగాణ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భవన్ చుట్టూ పోలీసులు మోహరించి కార్యకర్తలను చెదరగొట్టే చర్యలు చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఏసీపీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, బాల్క సుమన్‌పై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సింగరేణి సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామని చెప్పారు. సింగరేణి సంస్థతో పాటు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయాలని వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు.

"విచారణలో భాగంగా బాల్క సుమన్‌ను తీసుకెళ్లేందుకు వచ్చాం. గత మూడు రోజులుగా ఆయన ఆచూకీ స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం తెలంగాణ భవన్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో నోటీసులు అందించి విచారణకు హాజరు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం" అని ఏసీపీ తెలిపారు.మరోవైపు, ఈ చర్యలను బీఆర్ఎస్ నేతలు రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తున్నారు. పార్టీ కార్యాలయానికి పోలీసులు రావడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతుండగా, బాల్క సుమన్‌ను పోలీసులు విచారణ కోసం తీసుకెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.