పోసాని డిమాండ్.. మామూలుగా లేదుగా?
Published on: Mon Mar 3, 2025 9:51AM

సినీ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న టైమ్‌లో వైసీపీలోకి వచ్చి .. అటు సినీ అవకాశాలు తగ్గిపోయి.. ఇటు పొలిటికల్‌గా ఏం సాధించలేక తన గొయ్యి తానే తవ్వుకున్నారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి. ఇప్పుడు ఆయనకు ఇంకో రకంగా డిమాండ్ పెరిగిపోతోంది. రాజంపేట సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఆ 17 పోలీసు స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. నరసరావు పేట పోలీసులు అయితే ఇప్పటికే పీటీ వారెంట్ తో రాజం పేట సబ్ జైలుకు వెళ్లి ఆయనను అదుపులోనికి తీసుకుని నరసరావు పేట తరలించారు. మరో రెండు జిల్లాల పోలీసు అధికారులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు. మేం కోర్టు అనుమతి తీసుకున్నాం, ముందుగా మాకే పోసానిని అప్పగించాలి.. అని నరసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోసానికి తీసుకెళ్లేందుకు వారు వాహనాలు సైతం సిద్ధం చేసుకున్నారు.
ఒకేసారి మూడు పీటీ వారెంట్లు తీసుకురావడంతో పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలనే విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు. ఇందుకు సంబంధించిన నిబంధనలు పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారుల అనుమతితో పోసానిని పల్నాడు జిల్లా నరస రావుపేట పోలీసులకు అప్పగించారు. మొత్తానికి పోసానికి ఇప్పుడు ఇలా డిమాండ్ పెరిగిపోతోందన్న మాట


