పరిపూర్ణానంద స్వామికి ఊరట

 

కొద్దిరోజుల క్రితం నగర బహిష్కరణ బాగా హాట్ టాపిక్ అయింది.. ఓ టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న కత్తి మహేష్ శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసారని, వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.. దీనిపై సమీక్షించిన తెలంగాణ పోలీసులు ఆయనపై నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసందే.. మరోవైపు కత్తిమహేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ చౌటుప్పల్‌ నుంచి యాదాద్రి వరకు పరిపూర్ణానంద స్వామి చేపట్టిన పాదయాత్రకు రాచకొండ పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.. ఆయన్ని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు.. కొద్దిరోజుల తర్వాత ఆయనపై హైదరాబాద్‌ నగర బహిష్కరణ వేటు వేశారు.. గతేడాది ఓ సభలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, అందువల్లే బహిష్కరణ విధిస్తున్నట్లు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.. అనంతరం ఆయన్ని హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు తరలించారు.. అయితే తెలంగాణ ప్రభుత్వం తనపై విధించిన నగర బహిష్కరణను సవాల్‌ చేస్తూ పరిపూర్ణానంద స్వామి హైకోర్టును ఆశ్రయించారు.. దీనిపై విచారించిన న్యాయస్థానం ఆయనపై నగర బహిష్కరణ ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.