97 మందితో బాబుకి భద్రత.. ఏపీ హైకోర్టు తీర్పు!!

 

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భద్రతపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబుకు మొత్తం 97 మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తన భద్రత కుదించడాన్ని సవాల్‌ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బుధవారం చంద్రబాబు భద్రత పిటీషన్‌పై హైకోర్టు విచారించింది. ప్రభుత్వం, చంద్రబాబు తరపు వాదనలు విన్న అనంతరం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. క్లోజ్‌డ్‌ సెక్యూరిటీ ఎవరి పని అనే అంశంపై ఎన్‌ఎస్‌జీ, స్టేట్‌ సెక్యూరిటీ మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలపై మూడు నెలల్లో ఓ నిర్ణయానికి రావాలని నిర్దేశించింది. అలాగే, చంద్రబాబు కాన్వాయ్‌లో జామర్ వాహన సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. చంద్రబాబుకు సీఎస్‌వోను ప్రభుత్వం నియమించవచ్చని హైకోర్టు తెలిపింది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు భద్రతను తగ్గించడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు ఉద్దేశపూర్వకంగానే భద్రత తగ్గించారంటూ బాబు హైకోర్టును ఆశ్రయించారు. బాబుకు ప్రస్తుతం 74 మందితో ఏపీ ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. గతంలో కంటే బాబుకు అదనంగానే భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే బాబు మాత్రం తనకు భద్రత మరింత పెంచాలని కోరిన నేపథ్యంలో ఆ సంఖ్య 97కు పెంచడం జరిగింది. అలాగే ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు కావాలని బాబు హైకోర్టులో కోరడం జరిగింది. అయితే ప్రతిపక్ష నేతకు ఎప్పుడూ ఒక సీఎస్‌వోను మాత్రమే ఇస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు ఒక సీఎస్‌వోను కేటాయించాలని కోర్టు తెలిపింది.