చంద్రబాబుకి కొంచెం ఇష్టం కొంచెం కష్టం... సెక్యూరిటీ వివాదంలో హైకోర్టు షాక్‌

 

చంద్రబాబుకి ఊరట... సెక్యూరిటీ క్లియరెన్స్... అంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. ఒకట్రెండు ఛానెల్స్ అయితే హైకోర్టు తీర్పుపై టీడీపీ హర్షం అంటూ బ్రేకింగ్స్ నడిపాయి. కానీ హైకోర్టు తాజా ఆదేశాలతో చంద్రబాబు పెద్దగా ఒరిగిందేమీ లేదు. అంతేకాదు ఒకవిధంగా చెప్పాలంటే... ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ, ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన చంద్రబాబుకి ఊహించని షాక్ తగిలింది.

జగన్ ప్రభుత్వం తన భద్రతను కుదించిందంటూ బాబు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో మాదిరిగా సెక్యూరిటీని కంటిన్యూ చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది, ఎందుకంటే, చంద్రబాబు తనకు 147మందితో భద్రత కల్పించాలని హైకోర్టుకు వెళ్లగా, 97మందితో సెక్యూరిటీ కల్పిస్తున్నామని, ఇది జెడ్‌ కేటగిరి భద్రతా సిబ్బంది కంటే 43మంది ఎక్కువని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అంతేకాదు ఇవ్వాల్సిదానికంటే ఎక్కువ సిబ్బందిని కేటాయించి, డబుల్‌ సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానానికి జగన్ సర్కారు నివేదించింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు... ప్రస్తుతమున్న 97మంది భద్రతా సిబ్బందిని కొనసాగించాలని ఆదేశించింది. 

అయితే, గుడ్డిలో మెల్లలా  బాబు కాన్వాయ్‌‌లో జామర్ వాహన సౌకర్యం కల్పించాలని సూచించింది. ఇక, చంద్రబాబు క్లోజ్‌‌డ్‌ సెక్యూరిటీ ఎవరి పనో... మూడు నెలల్లో తేల్చుకోవాలని ఎన్‌ఎస్‌జీ అండ్ స్టేట్‌ సెక్యూరిటీకి నిర్దేశించింది. ఈ లెక్కన చూస్తే, చంద్రబాబుకు హైకోర్టు నుంచి స్వల్ప ఊరట మాత్రమే లభించింది. పైగా, సీఎస్‌వోగా భద్రయ్యను నియమించాలన్న బాబు విజ్ఞప్తిని సైతం ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సీఎస్‌వో ఎవరుండాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందంటూ ఊహించని షాకిచ్చింది.