TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉరి శిక్ష.. దిల్ సుఖ్ నగర్ జంటపేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు

Published on: Tue Apr 8, 2025 11:13AM

హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో పేలుళ్లకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్షే సరైందని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళవారం (ఏప్రిల్ 8) తుది తీర్పు వెలువరించింది. గతంలో ఇదే కేసులో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. పేలుళ్లకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీసిన నిందితులు అక్తర్, జియా ఉర్ రహమాన్, యాసిన్ భత్కల్, తహసీన్ అక్తర్, అజాజ్ షేక్ లకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.  

2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాండ్ సమీపంలో  స్వల్ప వ్యవథిలో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో మొత్తం 18 మంది మరణించగా, మరో 130 మంది గాయపడ్డారు.  ఈ జంటపేలుళ్ల కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన రియాజ్ భత్కల్ ను ప్రధాన నిందితుడిగా అలాగే  యాసిన్ భత్కల్, అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, అజాజ్ షేక్ లకు కూడా ఈ పేలుళ్లతో సంబంధం ఉందని నిర్ధారించింది. ఈ కేసును సుదీర్ఘంగా విచారించినఎన్ఐఏ కోర్టు వీరికి ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వీరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్ధిస్తూ మంగళవారం (ఏప్రిల్ 8) తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు.