జగన్ పిటీషన్ విచారణకు అర్హత ఉందా?.. రేపు తేలనుంది

 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిటీషన్ పై విచారణను హైకోర్టు శుక్రవారం నాటికి వాయిదా వేసింది. జగన్ పిటీషన్ విచారణకు అర్హత ఉందా? లేదా? అనేది రేపు నిర్ణయిస్తామని హైకోర్టు ప్రకటించింది. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కత్తి దాడి ఘటనపై జగన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కత్తి దాడి ఘటనపై స్వతంత్ర్య దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలంటూ జగన్ పిటీషన్ లో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై నమ్మకం లేదని, అది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతోందన్నారు. ఈ పిటీషన్ లో సీఎం చంద్రబాబుతో సహా ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటీషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. హత్యాయత్నం కేసు వివరాలను తమ ముందుంచాలని ఏపీ అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. విశాఖ పోలీసులకు వైఎస్ జగన్ సహకరించలేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. కేసును తప్పుదోవ పట్టించేలా ఏపీ డీజీపీ వ్యవహరించారని పిటిషనర్ తరపు న్యాయవాది ఆరోపించారు. కాగా జగన్ పిటీషన్ విచారణార్హతపై కోర్టు శుక్రవారం విచారించనుంది.