మరోసారి స్టేటస్ కో పొడిగింపు.. విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణంపై ధిక్కార పిటిషన్
Published on: Thu Aug 27, 2020 12:59PM
ఏపీలో రాజధాని తరలింపు, సీఆర్డీఏ చట్టం రద్దుపై స్టేటస్ కోను హైకోర్టు మరోసారి పొడిగించింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దుపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగగా, స్టేటస్ కోను సెప్టెంబరు 21 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 21కి వాయిదా వేసిన హైకోర్టు.. ఈ విషయంపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి సెప్టెంబరు 11 వరకు, అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబరు 17 వరకు ధర్మాసనం గడువు ఇచ్చింది.
మరోవైపు, విశాఖపట్నంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణంపై హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరఫు న్యాయవాది నితీశ్ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిగింది. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో ఏపీ సర్కారు అతిథి గృహాన్ని నిర్మించనుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి భవనం ఐదు ఎకరాల్లో ఉండగా.. కాపులుప్పాడులో 30 ఎకరాల్లో ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ను ఎలా కడతారని నితీష్ గుప్తా ప్రశ్నించారు. ఒక వైపు హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో అమల్లో ఉన్న సమయంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాజధాని తరలింపులో ఇది కూడా ఒక భాగమేనని ఆయన తెలిపారు. వాదనలు విన్న అనంతరం.. దీనిపై కూడా వచ్చేనెల 10లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.


