దుమారం రేపుతున్న అమరావతి హై కోర్టు వివాదం...

 

ఏపీలో హై కోర్టు వివాదం తీవ్రరూపం దాల్చుతోంది, హైకోర్టు కావాలంటూ సీమలో ఆందోళన ఊపందుకుంది. హై కోర్టుని అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదని ఆంధ్రాలో లాయర్ లు ఉద్యమ బాట పట్టారు. దీంతో ఏపీలో హై కోర్టు వివాదం తీవ్రస్థాయికి చేరుతోంది. శ్రీబాగ్ ఒప్పందం గుర్తు చేస్తూ సీమలోని న్యాయవాదులు కదం తొక్కుతున్నారు. రాజధాని విషయంలోనే సీమకు అన్యాయం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు గుంటూరులో ఐదు జిల్లాల న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు అయితే, రాయలసీమకు హై కోర్టు కావాల్సిందేనని కర్నూలులో లాయర్లు రిలే, నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారనే ప్రచారం మొదలైన క్షణం నుంచి రాయలసీమలో ఉద్యమాలు మొదలయ్యాయి.

శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు ఊపందుకున్నాయి. కర్నూలు, కడప జిల్లా న్యాయవాదులు గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతలు, సామాజికవేత్తలతో కలిసి పోరు బాట పట్టారు. సీమకు మొదట్నుంచీ అన్యాయం జరిగిందని హై కోర్టు విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని న్యాయవాదులు అంటున్నారు. హైకోర్టు సీమకు ఇవ్వాలంటూ కడప, కర్నూలు జిల్లాలో ఇప్పటికే రిలే, నిరాహార దీక్షలు నడుస్తుంటే తాజాగా అనంతపురంలో కూడా సీమకు హైకోర్టు నినాదంతో ఆందోళనలు మొదలయ్యాయి. అనంతపురం కోర్టు నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు న్యాయవాదులంతా విధుల బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు.

శ్రీబాగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించరాదని దాన్ని అనుసరించి సీమకు న్యాయం చేయాలని అక్కడి న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. హై కోర్టు కోసం ఆంధ్రా లోనూ అలజడి మొదలైంది, అమరావతి నుంచి హైకోర్టును తరలిస్తే ఊరుకునేది లేదంటూ ఆంధ్రాలోని ఆరు జిల్లాల న్యాయవాదులు ఉద్యమ బాట పట్టారు. హై కోర్టు రాజధానిలోనే ఉండాలని అమరావతి నుంచి మరో ప్రాంతానికి ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే గుంటూరులో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఉద్యమించామని, ఇప్పుడు వచ్చిన హైకోర్టును ఎలా వదులుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు, కృష్ణా, నెల్లూరుతో పాటు ఉభయ గోదావరి జిల్లాల న్యాయవాదులు గుంటూరులో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.