TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణపై హైకోర్టు సీరియ‌స్‌

Published on: Thu Jun 23, 2022 5:25AM

ఎవ‌రికి వారు త‌మ‌కు తోచిన‌ట్టు చేస్తుంటే ఇక కోర్టు లెందుకు?  సామాన్య ప్ర‌జ‌ల కేసుల్లో హైకోర్టు దాకా వెళ్లిన‌వి ఉప‌సంహ‌రించు కోవడానికి బొత్తిగా వీలే వుండ‌దు. కానీ ప్ర‌జా ప్ర‌తినిధులపై కేసులు ఉప‌సంహ‌ర‌ణ‌కు ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ తో సంబంధం లేకుండా కేసులు తొల‌గించ‌డానికి మార్గాల‌న్నీ అనుకూలిస్తాయి. ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై ఏపీ హైకోర్టు  సీరియస్ అయ్యింది. 

ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై కేసుల ఉపసంహరణను సవాల్‌ చేస్తూ.. హైకోర్టులో ఏపీజేఎఫ్‌ అధ్యక్షుడు చెవులు కృష్ణాంజ నేయులు పిటిషన్‌ వేశారు. న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించారు. పీపీతో సంబంధం లేకుండా డీజీపీ, కలెక్టర్‌ ఆదేశాలతో.. కేసులు ఎలా తొలగిస్తారని న్యాయవాది ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేసులు తొలగిం చాలంటే.. హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉందని శ్రవణ్‌కుమార్‌ పేర్కొన్నారు. హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా తొల గించారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇప్పటివరకు ఎన్ని కేసుల తొలగింపునకు హైకోర్టు అనుమతి తీసుకున్నారని ప్రశ్నించింది. ఎన్ని ఉపసంహరించారన్న దానిపై అఫిడవిట్ వేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఓటర్లకు డబ్బుల పంపిణీ, అధికారులపై దాడుల కేసులు కూడా తొలగించారని ధర్మాసనం దృష్టికి శ్రవణ్‌కుమార్ తీసుకొచ్చారు. ప్రభుత్వం అఫిడవిట్ వేయకుంటే కేసులో ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.