కేసీఆర్ సర్కార్ పై హైకోర్టు సీరియస్.. ప్రజలు తిరగబడితే తట్టుకోలేరు!!

 

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సమ్మె ప్రారంభమై రెండు వారాలు అవుతున్నా ఎందుకు ఆపలేకపోయారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. అదేవిధంగా ఇంతవరకు ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఎండీని నియమించడం వల్ల సమస్య పరిష్కారం కాదని, ఇప్పటికే సమర్థుడైన ఇన్‌చార్జి ఉన్నారని కోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే, ఆయన సమర్థవంతుడు అయినప్పుడు.. ఆయననే ఎండీగా నియమించవచ్చు కదా అని కోర్టు ప్రశ్నించింది. రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె జరుపుతుంటే ఎందుకు ఆపలేకపోయారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరికొంత మంది ఆర్టీసీకి మద్దతు తెలిపితే ఆందోళనను ఎవరూ ఆపలేరని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తివంతులని... వారు తిరగబడితే ఎవరూ ఆపలేరని కోర్టు వ్యాఖ్యానించింది.