అచ్చెన్న కేసు లో దర్యాప్తు అధికారికి ముక్క చీవాట్లు పెట్టిన హైకోర్టు

ఎపి మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఇఎస్ఐ అవినీతి కేసులో ఎసిబి అరెస్ట్ చేసి విజయవాడ తరలించిన సంగతి తెలిసిందే. ఐతే అయన అరెస్ట్ కు ఒక రోజు ముందు ఆయనకు పైల్స్ ఆపరేషన్ జరగడంతో 600 కిలోమీటర్ల రోడ్ ప్రయాణం లో తీవ్రంగా ఇబ్బంది పడినట్లుగా వార్తలు వచ్చాయి.

నిన్న అచ్చెన్న కేసు విచారణ సందర్బంగా ప్రధాన దర్యాప్తు అధికారి పై ఇదే విషయమై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆ అధికారులను హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఈ అరెస్ట్ కు ముందు రోజే ఆపరేషన్ జరిగిన ఆయనను ఆరు వందల కిలోమీటర్ల మేర కారులో తీసుకొచ్చారు. ఐతే దారి పొడవునా ఆయనకు రక్త స్రావం జరిగిందని ఎసిబి రిపోర్ట్ లో పేర్కొంది. దానితో అయన ప్యాడ్ లు కూడా మార్చుకుంటూ వచ్చారని ఆ రిమాండ్ రిపోర్టులో ఎసిబి పేర్కొంది. ఐతే ఏసీబీ అధికారులు మాత్రం అచ్చెన్నకు ఆపరేషన్ జరిగిన సంగతి తమకు తెలియదని అబద్దం ఆడే ప్రయత్నం చేసినా హైకోర్టు ముందు వారు దొరికిపోయారు. తనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని అచ్చెన్న వేసిన పిటిషన్‌పై హై కోర్టులో విచారణ జరిగిన సమయంలో ఏసీబీ అధికారులు అచ్చెన్న పట్ల ఎంత దారుణంగా వ్యవహరించారు అనే విషయం వెలుగులోకి వచ్చింది.

నేరం అనేది పాపంతో సమానమని, నిందితుడు పాపం చేసినవాడని, అతడికి ఏ ఇతర హక్కులూ ఉండవని భావించే స్థితి నుంచి సమాజం చాలా ముందుకెళ్లిందనే విషయాన్ని అర్ధం చేసుకోవడంలో ఆ దర్యాప్తు అధికారి విఫలమయ్యారని కోర్టు దుయ్యబట్టింది. ఎంత ఘోరమైన నేరం చేసిన నిందితుడికైనా రాజ్యాంగం కల్పించిన రక్షణను తొలగించలేరన్న విషయాన్ని ఆ అధికారి అర్థం చేసుకోవాలని చీవాట్లు పెట్టింది.

ఈ కేసులో పిటిషనర్‌ భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చెప్పడంతో..అసలు చట్టపాలన, మానవహక్కులు, ధర్మాన్ని దాటేందుకు దర్యాప్తు సంస్థకు ఎటువంటి అధికారం లేదని తెగేసి చెప్పింది. అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనను ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం లేదని ఏసీబీ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి అచ్చెన్నాయుడికి మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని రమేశ్‌ ఆస్పత్రికి పంపించాలని విజయవాడ జైలు సూ పరింటెండెంట్‌ను ఆదేశించింది. ఆయన ఆరోగ్యంపై వారానికి రెండు సార్లు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయాలని హాస్పిటల్ ని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో అదనపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది.