ఏపీ నంబర్ ప్లేట్లతో ప్రాబ్లమేంటి? హైకోర్టు ప్రశ్న...

 

హైకోర్టు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో ప్రశ్న ఎదురైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ పేరిట జారీ చేసిన నంబర్ ప్లేట్లను టీఎస్ పేరిట మార్చుకోవాలంటూ జూన్ నెలలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ మూడు మీద హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ జీవోను ప్రశ్నిస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యానికి స్పందిస్తూ కోర్టు పై విధంగా ప్రశ్నించింది. తమిళనాడు, కర్ణాటకలతో పాటు ఉత్తారాది రాష్ట్రాల వాహనాలు నంబర్ ప్లేట్ల పై ఎటువంటి మార్పు లేకుండా హైదరాబాద్‌లో తిరుగుతున్నాయని 60 ఏళ్లు ఉమ్మడిగా ఉండి కూడా ఏపీ నంబర్ ప్లేట్లతో హైదరాబాద్‌లో వాహనాలు తిరగడానికి అభ్యంతరం చెప్పడం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనకు మీ వివరణ ఏంటని హైకోర్టు రవాణా శాఖ న్యాయవాదిని ప్రశ్నించింది. అసలు ఇటువంటి జీవో జారీకి ఏ చట్టం అనుమతిస్తున్నదో తెలపాలని నిలదీసింది. ఈ విషయంపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని రవాణా శాఖ న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది.