హైకోర్టు సంచలన తీర్పు.. మిషన్ బిల్డ్ ఏపీ అధికారిపై కేసు నమోదుకు ఆదేశం
Published on: Wed Dec 30, 2020 3:36PM
మిషన్ బిల్డ్ ఏపీ కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేసుకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన మిషన్ బిల్డ్ అధికారి ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం అభియోగాల కింద, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద కేసులు నమోదు చేయాలని రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. ప్రభుత్వం న్యాయ ప్రక్రియలో జోక్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది.
కాగా, మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో జగన్ సర్కార్ ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియను సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ల విచారణ నుంచి జస్టిస్ రాకేష్ కుమార్ తప్పుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు మిషన్ బిల్డ్ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసులో జస్టిస్ రాకేష్ కుమార్ పక్షపాతంలో వ్యహరించే అవకాశం ఉందని ఆయన అఫిడవిట్‌లో ఆరోపించారు.


